దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీటీడీ మార్చి నెల మూడవ వారంలో భక్తులకు స్వామి వారి దర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం స్వామి దర్శనం విషయంలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ గతంలోనే ప్రకటించింది. 
 
అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపు 300 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని తెలుస్తోంది. హుండీ ఆదాయం ద్వారానే టీటీడీ 130 కోట్ల రూపాయల వరకు నష్టపోయిందని తెలుస్తోంది. మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉండటంతో మరో 100 కోట్ల రూపాయలు టీటీడీ నష్టపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు లాక్ డౌన్ ఎత్తివేసినా ప్రజలు ప్రయాణాలకు, పుణ్యక్షేత్రాల దర్శానానికి అంతగా ఆసక్తి చూపించే అవకాశం లేదు. 
 
లాక్ డౌన్ వల్ల దాదాపు అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. సామాన్య ప్రజలు చేతిలో నగదు లేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ ముందు రోజుకు దాదాపు లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేవారు. లాక్ డౌన్ తరువాత భక్తుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అందువల్ల తిరుమలలో హోటల్స్, ఇతరత్యా వ్యాపారాలు చేసేవారు సైతం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 
 
టీటీడీ వీరికి అద్దె తగ్గించడం లేదా పూర్తిగా అద్దె మాఫీ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా చూసినా కరోనా వైరస్ విజృంభణ వల్ల టీటీడీ భారీగా నష్టపోనుందని తెలుస్తోంది. టీటీడీ ఆదాయంతో ఆస్పత్రులు, స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలు నడపనుంది. ఆదాయం తగ్గితే టీటీడీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఆటంకం కలిగే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: