వాళ్లంతా రోజూ పొద్దు పొడవక ముందే నిద్ర లేస్తారు. నిత్యం పట్నం వైపే పరుగులు తీస్తుంటారు. రోజు వారీ సంపాదనతోనే బతుకు బండిని నెట్టుకొస్తుంటారు. అయితే అలాంటి అభాగ్యులు ప్రస్తుతం కరోనా దెబ్బకు విలవిల్లాడిపోతున్నారు. లాక్‌డౌన్‌తో విజయనగరం జిల్లాలో వేలాది మందికి ఉపాధి లేకుండాపోయింది. 

 

కరోనా మహమ్మారి దెబ్బకి విజయనగరం జిల్లాలో అన్ని రంగాలు కుదేలైపోయాయి. పరిశ్రమలు మూతబడ్డాయి. ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లాలో చిరు వ్యాపారుల పరిస్థితి దారుణంగా తయారైంది. పనులు లేకపోవటంతో ఆర్దిక కష్టాలు చుట్టుముట్టాయి. చేసిన అప్పులు తీరే మార్గం కనిపించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులు.

 

విజయనగరం జిల్లాలో సుమారు లక్షన్నరకు పైగానే అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరంతా సమీప పట్టణాలు, మండల కేంద్రాల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు. రోజూ అమ్మగా వచ్చిన దాంతోనే వీరు జీవనం సాగిస్తూ ఉంటారు. ఐతే లాక్‌డౌన్‌తో వీరి బతుకులు రోడ్డున పడ్డాయి. చిరు వ్యాపారాలకు అనుమతులు లేకపోవడంతో ఇంటికే పరిమితం అయ్యారు. పూట గడవక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన కరోనా సాయంతోనే కాలం వెళ్లదీస్తున్నారు.

 

ఇక పండ్లు, కూరగాయిలు అమ్మే వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు వ్యాపారం చేసుకోవటానికి అనుమతులు ఇచ్చారు. రైతు బజార్లు, ప్రధాన మార్కెట్లను వికేంద్రికరించారు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో మార్కెట్లు పుట్టుకొచ్చాయి. కొనే వారు సైతం తక్కువగానే వస్తున్నారు. హోల్‌సేల్‌ వ్యాపారుల దగ్గర కొన్న సరుకు అమ్ముడు పోవటం లేదు. తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి రవాణా సౌకర్యాలు లేవు. కొన్న ధర కంటే కూడా తక్కువకు అమ్మడమో...పారేయడమో చేస్తున్నారు. 

 

మరోవైపు...రోజువారీ వ్యాపారాలు, ఇంటి అవసరాల కోసం చిరు వ్యాపారులు చాలామంది వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. వీరి ఆవసరాలను ఆసరాగా చేసుకొని మైక్రో ఫైనాన్స్ సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. ప్రస్తుతం పనిలేదని తెలిసినా వారు మాత్రం ఊరుకోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లింపులు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. అవకాశం ఉన్నవారు అప్పు చెల్లిస్తుంటే..మరి కొందరు ఏంచేయలేని స్థితిలోనే ఉండిపోతున్నారు. అప్పులు తీర్చే మార్గం తెలియక వీరంతా తల్లడిల్లుతున్నారు.

 

మొత్తానికి లాక్‌డౌన్‌ కారణంగా చిరు వ్యాపారులు, ఫుట్ పాత్ వ్యాపారులకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటేనే తాము ఈ గండం నుంచి గట్టెక్కుతామంటున్నారు రైతులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: