కరోనా వైరస్ విజృంభణతో వేలాది ప్రాణాలు కోల్పోవడం, ఆర్థికవ్యవస్థ దెబ్బతినడంపై ... అమెరికా తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఈ వైరస్‌కు మూలం చైనా అని పదే పదే ఆరోపణలు గుప్పిస్తోన్న అగ్రరాజ్యం.. అక్కడి కాంగ్రెస్‌లో కీలక బిల్లు ప్రవేశపెట్టింది. వైరస్ వ్యాప్తికి సంబంధించిన వివరాలను అందించేందుకు డ్రాగన్ దేశం సహకరించని పక్షంలో.. కఠిన ఆంక్షలు విధించే దిశగా అడుగులేస్తోంది.

 

అమెరికా-చైనా మధ్య కరోనా వార్ తీవ్రరూపు దాలుస్తోంది. కరోనా వైరస్ విషయంలో చైనాపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్న అమెరికా.. తాజాగా అక్కడి కాంగ్రెస్‌లో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టింది. మహమ్మారి విజృంభణపై పూర్తి వివరాలిచ్చి సహకరించని పక్షంలో చైనాపై కఠిన ఆంక్షలు విధించాల్సిందేనన్నది బిల్లు సారాంశం.  తొమ్మిది మంది కీలక సెనేటర్లు మంగళవారం బిల్లును సెనేట్‌ ముందుంచారు. 

 

ది కొవిడ్‌-19 అకౌంటబిలిటీ యాక్ట్‌ పేరుతో  రూపొందించిన ఈ బిల్లులో... కీలక అంశాలను ప్రస్తావించారు. వైరస్‌ వ్యాప్తిలో డ్రాగన్ కంట్రీ  పాత్రపై .. అమెరికా, మిత్రపక్షాలు, U.N.O. అనుబంధ సంస్థల విచారణకు .. చైనా సహకరించాలని సెనెట్ సభ్యులు సూచించారు. దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. వైరస్ గురించి చైనా పూర్తి సమాచారమిచ్చిందా లేదా అనే అంశాన్ని 60 రోజుల్లోగా కాంగ్రెస్ కు తెలియజేయాలని.. అధ్యక్షుడు ట్రంప్‌నకు సూచించారు. చైనాలోని జంతువిక్రయశాలల్ని సైతం మూసివేయాలని డిమాండ్‌ చేశారు. 

 

సమాచారం అందించడంలో చైనా విఫలమైన పక్షంలో... ప్రాపర్టీ సీజ్, ప్రయాణ నిషేధాలు, వీసా ఉపసంహరణ, అమెరికా ఆర్థిక సంస్థల నుంచి రుణాల నిలుపుదల, అమెరికన్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో చైనా సంస్థలపై నిషేధం లాంటి ఆంక్షలు విధించేందుకు... ట్రంప్‌నకు అధికారం ఉంటుందని బిల్లులో స్పష్టం చేశారు. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రమేయం లేకుండా అమెరికాకు వైరస్ పాకే అవకాశమే లేదని,  బలంగా విశ్వసిస్తున్నానని బిల్లు రూపకర్త లిండ్సే గ్రాహం ఆరోపించారు. వైరస్‌ ఎలా వచ్చింది..? దాన్ని ఎలా అరికట్టాలనే దిశగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. అయితే చైనా ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: