సత్య నాదెళ్ల.. ఇండియన్లు సగర్వంగా చెప్పుకునే పేరు.. ఐటీ రంగంలో పేరెన్నికగన్న మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈవో.. టెక్నాలజీని ఇంకా ప్రజలకు ఎలా చేరువ చేయాలా అని తపనపడుతున్న ఓ ఐటీ మేధావి. అయితే ఈ ఐటీ మేధావి తాజాగా ఆంధ్రప్రదేశ్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. కరవు జిల్లా అయిన అనంతపురానికి అండగా నిలుస్తున్నామని ప్రకటించాడు.

 

 

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల కుటుంబం... పేద మహిళల ఆర్థికాభివృద్ధి కోసం 2 కోట్లతో జీవనోపాధి ప్రోత్సాహక ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. అనంతపురం జిల్లాలో ‘యాక్షన్‌ ప్రెటర్నా ఎకాలజీ సెంటర్‌’ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు అమలు చేయబోతున్నారు. మరి సత్య నాదెళ్ల అనంతపురం జిల్లాను ఎందుకు ఎంచుకున్నారంటే.. అందుకు ప్రధాన కారణం ఆయన వ్యక్తిత్వమే. సత్య నాదెళ్ల తండ్రి బి.ఎన్‌.యుగంధర్‌ అనంతపురం జిల్లాకు చెందిన వారే. ఆయన కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా పని చేశారు.

 

 

సత్య నాదెళ్ల కుటుంబం జిల్లా కరవు నివారణ సంస్థను ఏర్పాటు చేయించడంలో కీలకపాత్ర వహించారు. ప్రస్తుతం చేపడుతున్న జీవనోపాధి ప్రాజెక్టు అమలు మార్గదర్శకాలను సత్య నాదెళ్ల సతీమణి అనుపమ తండ్రి అయిన కె.ఆర్‌.వేణుగోపాల్‌ రూపొందించారు. గతంలో ప్రధానమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసిన ఆయన పేదరిక నిర్మూలనపై 1992లో సార్క్‌ దేశాలు ప్రవేశపెట్టిన నివేదికకు రూపకల్పన చేశారు.

 

 

అందుకే సత్యనాదెళ్ల తన తండ్రి సేవల జ్ఞాపకార్థంగా ఆ సేవా కార్యక్రమాలు కొనసాగిలాని ఆశించారు. చిరు వ్యాపారాలు, పాల అమ్మకం, పొట్టేళ్ల పెంపకం, టైలరింగ్‌, కంబళ్ల తయారీ.. ఇలా మొత్తం 20 రకాల పనులకు స్వయం సహాయక సంఘాలకు రుణం ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: