అమరావతి వ్యవహారంలో ఎట్టకేలకు జనసేన పార్టీ తమ అభిప్రాయం ఏమిటో లిఖితపూర్వకంగా హైకోర్టుకు అఫిడవిట్ ద్వారా తెలియజేసింది. అమరావతి పై రాజకీయ పార్టీల అభిప్రాయం ఏమిటో చెప్పాలంటూ హైకోర్టు నోటీసు ఇవ్వడంతో, అన్ని పార్టీలు తమ అభిప్రాయాన్ని చెబుతూ వస్తున్నాయి. ఈ మేరకు జనసేన పార్టీ కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలనేదే జనసేన అభిమతమని పేర్కొంది. గతంలోనే మూడు రాజధానుల ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని, అమరావతి కి తమ మద్దతు అని ఎప్పుడో పవన్ చెప్పేశారు. అంతేకాకుండా గతంలో అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా పవన్ దీక్ష సైతం చేపట్టాడు. అమరావతిలో రాజధాని నిర్మిస్తారనే ఉద్దేశంతో, ఆ ప్రాంత రైతులు వేలాది ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారని, కానీ మూడు రాజధానుల ప్రతిపాదన కారణంగా వీరంతా నష్టపోతారని, అమరావతి కోసం భూములు త్యాగం చేసిన 28 వేల మంది రైతుల భవిష్యత్తు గురించి ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలా నష్టపోతున్నారని, వీరి కోసం ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధం అంటూ తేల్చేశారు.


 ఇప్పుడు హైకోర్టులోనూ, తమ అభిప్రాయం తెలియజేయడంతో ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ మరో ప్రశ్న జనసేన విషయంలో కలుగుతోంది. బిజెపి, జనసేన ప్రస్తుతం కొత్త పెట్టుకున్నాయి ఏపీలో అన్ని వ్యవహారాలను కలిసి సమన్వయంగా ముందుకు వెళ్లాలని, ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని పంచుకోవాలని చూస్తున్నాయి. కానీ ఏపీ రాజధాని విషయంలో ఈ రెండు పార్టీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రాజధాని వ్యవహారంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంలో తాము జోక్యం చేసుకోమని, మూడు రాజధానులు పెట్టుకున్నా, తమకు ఏ అభ్యంతరం లేదని బిజెపి ప్రకటించేసింది. 


అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ మాత్రం దానికి విరుద్ధంగా అమరావతికి జై కొట్టడం, దీనిపై అవసరమైతే ఉద్యమం చేపట్టేందుకు సిద్దమవుతుండటంతో బీజేపీ జనసేన పొత్తు పై అనుమానాలు కలుగుతున్నాయి. ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాల్సిన బిజెపి, జనసేన ఇప్పుడు అమరావతి పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం తో పొత్తు పై నీలినీడలు కమ్ముకున్నాయి. జనసేన అమరావతి కి జై కొట్టడం పై బిజెపి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో అనే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ ఉంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: