చినబాబు ఇపుడు మళ్ళీ కనిపిస్తున్నాడు. కరోనా తరువాత పెద్దగా కనిపించని లోకేష్ ఇపుడు మళ్ళీ అమరావతి వీధుల్లో దర్శనం ఇస్తున్నాడు. లోకేష్  ఒక విధంగా జోరు పెంచుతున్నాడు. సైకిల్ కి రిపేర్లు చేసే పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. అసలు ఇంతకీ లోకేష్ చేతికి తాళాలు ఇచ్చేసిన పెదబాబు చంద్రబాబు సంగతేంటి అంటే ఆయన తెర వెనక వ్యూహాలు రచించే పనిలో ఉన్నారని అంటున్నారు. జాగ్రత్తగా గమనిస్తే లోకేష్ ఈ మధ్య ఒక్కసారిగా  టీడీపీ రాజకీయాల్లో హైలెట్ అవుతున్నాడని చెప్పవచ్చు.

అమరావతి రాజధాని రైతుల 300 రోజుల నిరసన కార్యక్రమానికి లోకేష్ స్వయంగా హాజరై టీడీపీ తరఫున సంఘీభావం ప్రకటించారు. అదే సమయంలో చంద్రబాబు అక్కడ కనిపించలేదు. ఇక తెలుగు మహిళా కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా లోకేష్ నాయకత్వంలోనే జరిగింది. నిజానికి దీనికి పార్టీ ప్రెసిడెంట్ హోదాలో చంద్రబాబే వస్తూంటారు. ఇప్పటివరకూ ఉన్న ఆ సంప్రదాయాన్ని కాదని జాతీయ కార్యదర్శిగా ఉన్న లోకేష్ చేయడం అంటే ఆయనకు చాలా పెద్ద పనే అప్పగించారని అర్ధమవుతోంది.

ఆ మధ్య అచ్చెన్నాయుడు, జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు అరెస్ట్ అయినపుడు కూడా లోకేష్ వారి ఇళ్ళకు వెళ్ళి పరామర్శ చేసి వచ్చారు. ఇలా చంద్రబాబు సగం భారాన్ని లోకేష్ ఈ మధ్యన మోస్తున్నాడు. ఇక టీడీపీ కొత్తగా ప్రకటించిన పార్టీ కమిటీల కూర్పులోనూ చినబాబు ముద్ర స్పష్టంగా ఉందని అంటున్నారు. యువతకు జూనియర్లకు పార్టీ పదవులు అప్పగించడం ద్వారా తనకంటూ కొత్త బలాన్ని ఆయన టీడీపీలో సమకూర్చుకుంటున్నాడు అంటున్నారు. మొత్తం మీద చూస్తే టీడీపీలో ఇక మీదట లోకేష్ బాబు ప్రధానమైన  భూమికనే నిర్వహిస్తారని  అంటున్నారు. చంద్రబాబు వెనక ఉండి కధ నడిపిస్తారని కూడా చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా వారసుడు జోరు చేయడంతో టీడీపీ దశ మారుతుందా అని తమ్ముళ్ళు ఆలోచిస్తున్నారుట.



మరింత సమాచారం తెలుసుకోండి: