మొక్కజొన్న రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర ఇచ్చి.. మక్కలు కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయంపై రివ్యూ చేసిన కేసీఆర్‌.. రైతులు నష్టపోతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.

మద్దతు ధర కోసం ఆందోళనబాట పట్టిన మొక్కజొన్న రైతులకు.. తీపికబురు వినిపించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. వద్దని చెప్పినా మొక్కజొన్న సాగుచేసిన రైతులకు అండగా ఉంటామన్నారు. క్వింటాల్‌కు 1850 రూపాయలు చెల్లించి.. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని.. రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

మొక్కజొన్నలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టే..  వర్షాకాలంలో మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం కోరిందని.. అయినప్పటికీ రైతులు మక్కల సాగు చేశారని సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దంటే మొక్కజొన్నలు సాగు చేశారని, వాస్తవానికి ప్రభుత్వానికి మొక్కజొన్నలు కొనుగోలు చేసే బాధ్యత లేదని సీఎం అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ఈ నష్టాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధపడి మొక్కజొన్న కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు కేసీఆర్‌.

గత యాసంగిలో మార్క్ ఫెడ్ ద్వారా 9 లక్షల టన్నుల మొక్కజొన్నలను కోనుగోలు చేసేందుకు ప్రభుత్వం 1668 రూపాయలు కోట్లు ఖర్చు చేసింది. ఆ మొక్కజొన్నలకు బయట మార్కెట్లో ధర లేకపోవడంతో వేలం వేయాల్సి వచ్చింది. ఈ వేలంలో కేవలం 823 కోట్ల రూపాయలు మాత్రమే రావడంతో.. ప్రభుత్వం భారీగా  నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఈసారి మక్కలు సాగు చేయొద్దని రైతుల్ని కోరింది ప్రభుత్వం. అయినప్పటికీ వినకుండా మక్కలు వేసిన కొందరు రైతులు.. మద్దతు ధరకు కొనాలంటూ ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌ రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో.. మొక్కజొన్నలను ప్రభుత్వమే కొంటుందని ప్రకటించారు.

మొత్తానికి మొక్కజొన్న రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభావార్త చెప్పారు. వరదలతో పంటనష్టపోయిన ఈ కష్టకాలంలో రైతన్నలకు ఆపద్భాంధవుడిలా నిలిచాడు సీఎం.





మరింత సమాచారం తెలుసుకోండి: