తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల సమరం కాకపుట్టిస్తోంది. ఈ ఉపఎన్నిక కేవలం పార్టీల మధ్యే కాదు.. మీడియా మధ్య కూడా కాక పుట్టిస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలోని ప్రముఖమైన చానళ్లు రెండు ఈ దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా ముఖాముఖీ ఢీకొడుతున్నాయి. అధికార పార్టీ కి చెందిన టీ న్యూస్.. అధికార పార్టీ వాయిస్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కేవలం టీఆర్ఎస్‌ వాయిస్ వినిపిస్తూ ఉన్నందువల్లనే టీ న్యూస్ తెలంగాణలో అంత బలంగా పాతుకుపోలేదు. కాకపోతే తెలంగాణ వాయస్ వినిపిస్తున్న తక్కువ ఛానళ్లలో టీ న్యూస్ కూడా కీలకమే మరి.

అయితే.. తెలంగాణ వాయిస్ వినిపిస్తూ జనం బాటలో నడిచే చానల్ గా పేరున్న ఛానల్ వీ6, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీటవేస్తూ.. జనంలోకి వెళ్లే కార్యక్రమాలు నిర్వహిస్తూ వీ6 తెలంగాణ సమాజంలో మంచి పేరు సంపాదించింది. అయితే ఈ ఛానల్ అధిపతి వివేక్.. గతంలో టీఆర్‌ఎస్ పార్టీలోనే ఉండేవారు.. అందువల్ల టీన్యూస్, వీ6 రెండూ దాదాపు ఒకే వాయిస్ వినిపించేవి.. కానీ ఇప్పుడు వివేక్ బీజేపీలో చేరారు.. ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అందువల్ల వీ6 ప్రస్తుతం బీజేపీ వాయిస్ గా వినిపిస్తోంది. ఈ మేరకు కొన్ని రోజులుగా ఆ ఛానల్ ప్రసారాలు ఉంటున్నాయి.

దుబ్బాక ఉప ఎన్నికల కారణంగా ఇప్పుడు ఈ రెండు తెలంగాణ ఛానళ్ల మధ్య పంచాయతీ మొదలైంది. ప్రత్యేకించి సోమవారం రఘునందన్ రావు బంధువు ఇంట్లో 18 లక్షలు దొరికిన విషయంలో ఈ రెండు ఛానళ్లు పరస్పరం విరుద్ధంగా వార్తలు ప్రసారం చేశాయి. వీ6 బీజేపీకి అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తుండటంతో టీ న్యూస్.. ఏకంగా వీ6పై వార్తల దాడికి దిగింది. వీ6 ఛానల్ బీజేపీని గుడ్డిగా సపోర్ట్ చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని టీ న్యూస్ బ్రేకింగ్స్ వేసింది. వీ6 ఛానల్ విశ్వసనీయతతను జనం ప్రశ్నిస్తున్నారని.. వీ6 న్యూస్ ప్రసారాలను జనం అసహ్యించుకుంటున్నారని బ్రేకింగ్స్ వేసింది. ఇలా ఓ ఛానల్ పై మరో చానల్ బ్రేకింగ్స్ వేయడం చాలా అరుదు అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: