రాష్ట్రంలో తమ ప్రభుత్వం 6లక్షలమంది పేదలకు అపార్ట్ మెంట్లు కట్టిస్తే.. జగన్ సర్కారు వాటిని కేటాయించకుండా ఇబ్బందులు పెడుతోందంటూ.. చంద్రబాబు ఇటీవల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ గృహకల్ప కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోతే సంక్రాంతి నాటికి ప్రజా ఉద్యమం మొదలు పెడతామని, లబ్ధిదారులతో కలసి ఇళ్లను స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరించారు. అయితే చంద్రబాబుకి అంతకంటే గట్టిగానే కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు. అసలు బాబు కట్టించిన ఇళ్లెక్కడున్నాయో చూపించాలని డిమాండ్ చేశారు.

వాస్తవానికి చంద్రబాబు చెబుతున్న ఇళ్ల లెక్క 6 లక్షలు. అయితే క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే వీటిలో ఒక్క ఇల్లు కూడా నివాసయోగ్యమైనది కాదు. ప్రతి అపార్ట్ మెంట్ విషయంలోనూ 20శాతం పనులు పెండింగ్ ఉన్నాయట. ఇలా పెండింగ్ పనులు పెట్టుకుని, కాంట్రాక్టర్లకు 2వేల 300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి చంద్రబాబు అధికారంలోనుంచి దిగి వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. కనీసం లక్షఇళ్లను కూడా ఓ కొలిక్కి తీసుకురాలేకపోయారని, అసలు బాబు చెబుతున్న 6 లక్షల ఇళ్లెక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. చంద్రబాబు కట్టించిన ఇళ్లు ఎగిరిపోయాయా అని సెటైర్లు వేశారు.
చంద్రబాబు హయాంలో కేంద్రం నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షల ఇళ్లకు అనుమతి వచ్చింది. దాన్ని రాష్ట్ర పథకంతో కలిపి ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో అపార్ట్ మెంట్లు నిర్మించింది టీడీపీ ప్రభుత్వం. అయితే ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, చదరపు అడుక్కి కనీసం 500 రూపాయలు పేదల దగ్గరనుంచి అదనంగా వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు గతంలోనే ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ఈ ఇళ్ల విషయంలో ప్రభుత్వాన్ని నిందిస్తుండే సరికి.. మరోసారి వైసీపీ నేతలు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చెప్పినట్టు 6 లక్షల ఇళ్లు చూపించాలని మంత్రి బొత్స సవాల్ విసిరారు. బొత్స కౌంటర్ తో చంద్రబాబు డైలమాలో పడ్డారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: