ఏపీ అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు రెండో రోజు అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలతో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. మొదటి రోజు చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులంతా సస్పెన్షన్ కి గురైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ చరిత్రలోనే ఓ ప్రతిపక్ష నాయకుడు స్పీకర్ పోడియం దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం జరగలేదని...రోజురోజుకి చంద్రబాబునాయుడు తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని అధికార వైసీపీ నేతలు విమర్శించారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ రాయలేని భాషలో బాబుపై తిట్ల దండకం వల్లించారు.



తాజాగా రెండోరోజు కూడా అసెంబ్లీలో మొదటి రోజు గందరగోళ పరిస్థితే పునరావృతమైనది. ఇళ్ల స్థలాల పంపిణీ అంశం చర్చకు వచ్చినప్పుడు వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు మాట్లాడుతూ పేదలకు ఇచ్చే ఇల్లు నాసిరకం కాకుండా నాణ్యత కలిగి ఉండాలన్నారు. గత తమ ప్రభుత్వ హయాంలో పేదల కోసం కట్టించిన లక్షలాది ఇళ్లు పంపిణీ కాకుండా ఎందుకు ఆపారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రికి ప్యాలెస్ లు ఉండాలని పేదలకు మాత్రం పనికిరాని ఇళ్లు పంపిణీ చేయాలని చూడడం సముచితం కాదని ఆయన అన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ఇళ్లకు మీరు స్టిక్కర్లు వేసుకోవడమేమిటని గట్టిగా అడిగారు. 



దాంతో జగన్ మాట్లాడుతూ మా ప్రభుత్వానికి మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పారు. మేనిఫెస్టో లో ఏం చెప్పామో అదే చేస్తున్నామని అన్నారు. మా మేనిఫెస్టోలో ఉన్న అంశాలు బాబుకి కనిపించలేదా? గుడ్డిగా చూస్తున్నారా? అని తీవ్రపదజాలంతో అడ్డు చెప్పారు. ఓ దశలో తమకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని చంద్ర బాబు స్పీకర్ తమ్మినేనితో గొడవపెట్టుకున్నారు. మంత్రులు బొత్స, కన్నబాబు తదితరులు వరుసగా వాగ్బాణాలు సంధించి టీడీపీ సభ్యులను ఇరుకున పెట్టేందుకు సంసిద్దులయ్యారు. సమాధానం చెప్పుకోవడానికి తమకు కూడా అవకాశం ఇవ్వాల్సిందేనని చంద్రబాబు స్పీకర్ని కోరారు. 



అయితే తాము నిబంధనల మేరకు రాజ్యాంగబద్దంగా నడుచుకుంటున్నామని స్పీకర్ బదులిచ్చారు. మీరు చెప్పింది చేసేందుకు రాసింది చదివేందుకు స్పీకర్ సిద్ధంగా లేదన్నారు. పిల్లి శాపాలకు, ఉడత బెదిరింపులకు బెదిరేది లేదని చెప్పారు. ఎప్పుడు ఎవరికీ అవకాశం ఇవ్వాలో తమకు తెలుసని సమాధానమిచ్చారు. తర్వాత అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ మా పథకాలకు మీ స్టిక్కర్లు వేసుకోవడం తగదన్నారు. చరిత్రలో స్టిక్కర్ ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. ఈ దశలో మళ్ళీ అసెంబ్లీ లో తీవ్రస్థాయిలో వాదప్రతివాదాలు జరిగాయి. పేదలపై అంత ప్రేమ ఉంటే కోర్టులకు వెళ్లి స్టే తెచుకోవడమెందుకంటూ వైకాపా సభ్యులు బాబుని తప్పు పట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: