హైదరాబాద్ : గ్రేటర్ పీఠం ఎవరిదన్న ఉత్కంఠకు నేటితో తెర పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఓటింగ్‌పై అన్ని పార్టీలూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది.  ఈ క్రమంలో జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారని, స్పష్టమైన మెజార్టీ ఇచ్చి  అభిమానం చాటుకున్నారని పంచాయితీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ప్రచారం సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, మీర్‌పేట్‌ డివిజన్‌ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని తేల్చి చెప్పారు. శుక్రవారం గ్రేటర్ ఫలితాల సందర్భంగా.. తాను సమన్వయం చేసిన కాప్రా, మల్లాపూర్‌, నాచారం, రామంతాపూర్‌ తదితర డివిజన్ల ప్రజలకు ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై స్పందించారు.  ఓడిపోయిన ఒకటి రెండు స్ధానాలపై సమీక్ష నిర్వహిస్తామని, ఓటమికి కారణాలపై చర్చిస్తామని తెలిపారు.

ఈ ఎన్నికల్లో మీర్‌పేట్‌ హౌసింగ్‌ బోర్డు కాలనీ డివిజన్‌‌కు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇన్‌చార్జిగా సేవలు అందించారు. ఫలితాల సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. తనకు బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ పార్టీ అభ్యర్ధిని నమ్మి ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఎవరు ఎన్నిరకాల ప్రలోభాలు చూపెట్టినా, కుట్రలు చేసినా ప్రజలు మాత్రం మోసపోలేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న టీఆర్‌ఎస్‌‌ను ప్రజల పార్టీగా గుర్తించారని కొనియాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేవలం పార్టీ అధినేత మాత్రమే కాదని, ప్రత్యేక రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ విధాత సీఎం అని, అలాగే ఆయన ఓ మహానాయకుడని మంత్రి ఎర్రబెల్లి మెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా మరోసారి సత్తా చాటుకుందని పేర్కొన్నారు.

దుబ్బాక పరాజయం తర్వాత గ్రేటర్ ఎన్నికలపై అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాయి. ఈ రెండు పార్టీలూ ఒకదాన్ని మించి మరొకటి ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు తదితరులు ప్రచారం చేశారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రలు స్మృతి ఇరానీ, అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ కూడా కరోనా వ్యాక్సీన్ సాకు చూపి ఓ సారి హైదరాబాద్ సందర్శించి వెళ్లారు. దీంతో కాషాయ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కచ్చితంగా మేయర్ పీఠం తమదేనంటూ ప్రకటనలు చేశారు. కానీ ఫలితాలు మాత్రం వేరేలా వచ్చాయి. అయితే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి కమలం పార్టీ చాలా మంచి ఫలితాలనే పొందిందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: