రెండు తెలుగు రాష్ట్రాలలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇక చలి నుండి ఉపశమనం పొందడానికి కొంత మంది చలి మంట వేసుకుంటారు. ఇక చలి మంటలతో ఓ వృద్ద గిరిజన మహిళ సజీవ దహనమైన విషాదకరమైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదం నెలకొంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గోపాల్ పూర్ అటవీ ప్రాంతంలోని తన చేనులోని పత్తి కుప్పకు కాపాలాగా నిద్రిస్తున్న కనక రేణుకాబాయి చలి మంటలకు ఆహుతైంది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో తాము సాగు చేస్తున్న భూముల్లో పత్తి పంట చేతికి రావడంతో దీపావళి నుండి గ్రామంలోని సగం మంది ఆదివాసి గిరిజన రైతులు చేలలోనే గుడిసెలు వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకొని పంటలకు కాపాలా ఉంటున్నారు.

అయితే పత్తి పంటను చేనులోనే కుప్పగా చేసి రాత్రిపూట కాపాలా ఉంటూ పంటను కాపాడుకుంటున్న కనక రేణుకాబాయి గత రాత్రి చలి మంటలు కాగుతూ నిద్రకు జారుకుంది. ప్రమాదవశాత్తు చలి మంటలు ఆమె కప్పుకున్న దుప్పటికి అంటుకుంది. పత్తి కుప్పలకు కూడా మంటలు అంటుకోవడంతో వృద్ద మహిళతోపాటు పత్తి కుప్పలు కాలి బూడిదయ్యాయి.

ఇక రేణుకాబాయి పక్క చేనుకు వచ్చిన రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఉట్నూర్ సిఐ నరేష్ , ఇంద్రవెల్లి ఎస్సై నాగ్ నాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పంచనామా నిర్వహించారు. కాగా ప్రతిరోజు చలిమంటలు కాగుతూ మంటలార్పి పడుకునే వారమని కానీ నిన్న తాను లేకపోవడంతో రాత్రి చలి మంటలు పెట్టుకుని తన తల్లి అలాగే నిద్రించడంతో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని సజీవ దహనమైనట్లు మృతురాలి కుమారుడు కనక శంభు తెలిపాడు. ఈ ఘటనతో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: