ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు అనూహ్యంగా ఢిల్లీ నుంచి పిలుపు రావ‌డంతో ఆయ‌న నేరుగా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ఆల‌యాల‌పై దాడుల ఘ‌ట‌నల నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు.. ఇటీవ‌ల కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లిసి ఏపీ ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా ఆల‌యాల‌పై జ‌రుగుతున్న దాడులు స‌హా.. రామ‌తీర్థం ప్రాంతాన్ని ప‌రిశీలించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు వెళ్లిన స‌మ‌యంలో అక్క‌డి పోలీసులు ఆయ‌న‌ను అడ్డుకోవ‌డాన్ని బీజేపీ నాయ‌కులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో ఈ విష‌యాన్ని కేంద్రం దృస్టికి తీసుకువెళ్లారు.

ఈ క్ర‌మంలోనే నేరుగా హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి జ‌గ‌న్‌కు పిలుపు వ‌చ్చింది. దీనిపై ప్ర‌భుత్వ వ‌ర్గాల్లో భిన్న‌మైన క‌థ‌నాలు వ‌స్తున్నాయి. జిల్లాల విభ‌జ‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్న నేప‌థ్యంలో దీనిన ప్ర‌భుత్వానికి వివ‌రించేందుకు జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నార‌ని సీనియ‌ర్ నాయ‌కులు అంటున్నారు. దీనిలో కొంత నిజం ఉంది. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. అయితే.. అదే స‌మ‌యంలో మ‌రో రెండు విష‌యాలు కూడా ఉన్నాయ‌నే స‌మాచారం అందుతోంది.

ఒక‌టి.. ఆల‌యాల‌పై దాడులు, బీజేపీ నేత‌ల‌కు ఎదుర‌వుతున్న అడ్డంకుల‌పై కేంద్ర‌మే జ‌గ‌న్‌ను పిలిపించింద‌ని చెబుతున్నారు. దీంతో ఏం జ‌రుగుతుంది ? జ‌గ‌న్‌కు షా.. త‌లంటుతారా ? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనిపై వైసీపీ నాయ‌కులు ఫోన్ల‌పై ఫోన్లు చేసుకుని మ‌రీ చ‌ర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌తో మ‌రో సారి వివాదం ఏర్ప‌డ‌డాన్ని కూడా కేంద్రం సీరియ‌స్‌గానే భావిస్తోంది. ఇప్ప‌టికే ఏడాది కాలంగా వివాదం జ‌రుగుతోంది.

అయితే.. ఇప్పుడు షెడ్యూల్ ఇచ్చిన త‌ర్వాత కూడా జ‌గ‌న్ స‌ర్కారు స‌హ‌క‌రించేది లేద‌ని చెప్ప‌డాన్ని బ‌ట్టి.. కేంద్రం దూకుడుగా వెళ్తున్న ఏపీకి బ్రేకులు వేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టుగా టీడీపీ నేత‌ల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఆయా ప‌రిణామాల‌పై ఏం జ‌రుగుతుంద‌నే విష‌యంపై వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం.. కొంద‌రు ఢిల్లీలోని పాత్రికేయుల‌ను అలెర్ట్ చేసి మ‌రీ .. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోర‌డం ఆస‌క్తిగా మారింది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: