రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఏపీకి రాజధాని లేకపోవడంతో, అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు, కృష్ణా జిల్లాకు దగ్గరగా గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రాజధాని ఎంపికకు అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా మద్ధతు తెలిపారు. ఇక అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా మార్చే క్రమంలో చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేశారో అందరికీ తెలుసు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులని రాజధానిలో భాగస్వాములు చేసి,వారి దగ్గర నుంచి 33 వేల ఎకరాలని సేకరించారు. ఇక అక్కడ నుంచి అమరావతి ప్రాంతంలో బాబు పలు తాత్కాలిక భవనాలు కట్టారు. మిగతా రాజధాని అంతటినీ గ్రాఫిక్స్‌లో చూపించారు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు బాబుని మళ్ళీ నమ్మే ప్రయత్నం చేయలేదు. జగన్‌ని భారీ మెజారిటీతో గెలిపించేశారు.

ఇక జగన్ వచ్చాక అమరావతి కొనసాగింపుపై అనుమానాలు మొదలయ్యాయి. అనుకున్న విధంగానే జగన్, బాబు మొదలుపెట్టిన అమరావతికి చెక్ పెడుతూ మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చారు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా ఉంచి, విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా, కర్నూలుని జ్యూడిషయల్ క్యాపిటల్ చేయనున్నట్లు ప్రకటించి, ఆ దిశగా వెళుతున్నారు. ఇక జగన్ నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించి, అమరావతి కోసం పోరాడుతుంది. అయితే టీడీపీ ఎందుకు పోరాడుతుందో అందరికీ తెలిసిందే.

కానీ అమరావతి ప్రాంత రైతులు నిరంతరాయంగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. రాజధాని కోసం భూములని త్యాగం చేసిన రైతులు, జగన్ మూడు రాజధానులు ప్రకటించిన దగ్గర నుంచి పోరాటం చేస్తున్నారు. అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ రైతులు ఉద్యమం మొదలుపెట్టి 400 రోజులైంది.

ఇక ఇక్కడ వైసీపీ అంటున్నట్లు పెయిడ్ ఆర్టిస్టులు అయితే ఇన్నిరోజులు అమరావతి ఉద్యమం చేయడం అనేది సాధ్యమవుతుందా అనే ప్రశ్నలు రావడం పక్కా. కేవలం చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులని పెట్టి అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారని వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అధికారంలో ఉన్న వైసీపీ నేతలు రైతులని ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో కూడా తెలిసిందే. ఒకవేళ డబ్బులు కోసం ఉద్యమం చేసే రైతులైతే ఇన్ని రోజులు జీవితాలని అడ్డం పెట్టి నిలబడరు.

రాజధాని తరలిపోతే తమ భవిష్యత్ దెబ్బతింటుందనే భయంతోనే నిజమైన రైతులు ఇన్నిరోజులు నుంచి ఉద్యమం చేస్తున్నారు. మరి అమరావతి రైతులకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: