ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అసలు స్థానిక ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, జగన్ ప్రభుత్వం మధ్య ఎలాంటి రగడ జరిగిందో కూడా తెలుసు. గత ఏడాది మార్చి నుంచి నిమ్మగడ్డ వర్సెస్ జగన్ ప్రభుత్వం అనే విధంగా వార్ నడుస్తోంది. తాజాగా కూడా నిమ్మగడ్డ పంచాయితీ ఎన్నికల నిర్వహణకు నోటీసు ఇచ్చేశారు. ఇక దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది.

ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికల నిర్వహణ ఇప్పుడే కుదరదని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు పెట్టడం కష్టమని కోర్టు చెప్పింది. దీంతో వైసీపీ నేతలు సంబరం చేసుకున్నారు. ఇక నిమ్మగడ్డపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషనర్ పదవికి రాజీనామా చేయాలని మాట్లాడారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిమ్మగడ్డ డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేశారు.

ఇక దీనిపై హైకోర్టు డివిజనల్ బెంచ్ తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్‌లు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించింది. ఈ తీర్పుని ప్రతిపక్షాలు స్వాగతిస్తుండగా, వైసీపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే టీడీపీని వీడి బీజేపీలో చేరిన ఎంపీ సీఎం రమేష్ సైతం, కోర్టు తీర్పుని స్వాగతించారు.

సింగిల్ జడ్జి తీర్పు సమయంలో వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడారని, ఎన్నికల కమిషనర్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని, ఇప్పుడు ధర్మాసనం తీర్పుతో వారంతా రాజీనామాలు చేస్తారా? అని ప్రశ్నించారు. సీఎం రమేష్ వ్యాఖ్యలని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీలోకి వెళ్ళినా సరే రమేష్ ఇంకా చంద్రబాబు మనిషే అని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికైతే సీఎం రమేష్ లాజిక్ మాత్రం బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఏదేమైనా వైసీపీ కావాలనే నిమ్మగడ్డని టార్గెట్ చేసి ముందుకెళుతున్న విషయం అందరికీ అర్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: