ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డకూ.. ఏపీ సీఎం జగన్ కూ మధ్య వైరం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.. ఏపీ అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌కు ఏమాత్రం సహకరించడం లేదు. ఎన్నికల నిర్వహణపై ఆయన ఎప్పటికప్పుడు ఇస్తున్న ఆదేశాలను అధికారులు చెత్త బుట్టలో పడేస్తున్నారు. కరోనా సమయంలో ఎన్నికలు పెడితే  మా పరిస్థితి ఏంటంటూ ఉద్యోగ సంఘాలు గళమెత్తాయి. వైసీపీ నేతలు కూడా అదే వాదన వినిపిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో కరోనా లాక్‌డౌన్‌ అనంతరం వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ, అసెంబ్లీ, పంచాయతీ, పట్టణ సంస్థలకు ఎన్నికలు నిరాటంకంగా జరిగాయంటూ ఈనాడు పత్రిక ఓ ఆసక్తికరమైన కథనం ప్రచురించింది.

కేంద్ర ఎన్నికల సంఘం జూన్‌ 19న రాజ్యసభ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిందని... నాటి నుంచి నేటి వరకూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో వరుసగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయని ఈనాడు రాసింది. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 11 రాష్ట్రాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో రాజ్యసభకు, అయిదు రాష్ట్రాల్లో స్థానిక సంస్థలకు, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటకల్లో శాసన మండలికి ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తు చేసింది.

అక్టోబరు 28 నుంచి నవంబరు 7 వరకు మూడు దశల్లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని.. నవంబరు 3న మధ్యప్రదేశ్‌లో 28, గుజరాత్‌లో 8, ఉత్తర్‌ప్రదేశ్‌లో 7, ఝార్ఖండ్‌, కర్ణాటక, నాగాలాండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో రెండేసి స్థానాల్లో, ఛత్తీస్‌గఢ్‌, హరియాణాల్లో ఒక్కో స్థానంలో, తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరిగాయని ఈనాడు రాసింది. నవంబరు7న మణిపుర్‌లో 5అసెంబ్లీ స్థానాలకు, బిహార్‌లోని వాల్మీకీనగర్‌ లోక్‌సభస్థానానికి ఉపఎన్నికలు, నవంబరు 9న ఉత్తర్‌ప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో 1 రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరిగింది.

ఇంతేనా.. నవంబరు 23, 27, డిసెంబరు 1,5 తేదీల్లో నాలుగు దశల్లో రాజస్థాన్‌లో 21 జిల్లా పంచాయతీలకు... డిసెంబరు 1న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు, 8 నుంచి 14వరకు కేరళలో స్థానిక సంస్థలకు, 11న రాజస్థాన్‌లో 50 పట్టణ స్థానిక సంస్థలకు, 22, 27 తేదీల్లో కర్ణాటకలో రెండు దశల్లో 5762 గ్రామ పంచాయతీలకు.. జనవరి 15న మహారాష్ట్రలో 14,234 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఈనాడు గుర్తు చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: