ఏపీ సీఎం జగన్, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య ఆధిపత్య పోరు ఇంకా ముగియనట్టే ఉంది. ప్రత్యేకించి పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ల పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన సెన్సుర్ ప్రొసీడింగ్స్ విషయంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్లు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ల పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన సెన్సుర్ ప్రొసీడింగ్స్ ను జగన్ సర్కారు తిరస్కరించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం.

అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ కు అధికారుల పై చర్యలు తీసుకునే పరిధి లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర కేడర్ లో పని చేసే అఖిల భారత సర్వీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన అధికారుల పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమీషన్ సిఫార్సు మాత్రమే చేయగలదని రాష్ట్ర ప్రభుత్వం తన  ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదే సమయంలో ఎన్నికల కమిషనర్‌ తీరుపై ప్రభుత్వం తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన సెన్సుర్ ప్రొసీడింగ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికార పరిధిలోకి చొచ్చుకొని రావడమేనని విమర్శించింది. ఇది కచ్చితంగా చట్ట పరమైన తప్పిదమని జగన్ సర్కారు స్పష్టం చేసింది. నిర్దేశిత నిబంధనల ను పాటించకుండా జారీ చేసిన సెన్సుర్ ప్రొసీడింగ్స్ ను తిరస్కరిస్తున్నట్టు ఏపీ సీఎస్ అదిత్య నాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వంతో వివాదాలు సమసిపోయాయని.. అందరు గతం మరిచిపోయి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని నిన్న నిమగ‌డ్డ రమేశ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కానీ జగన్ సర్కారు మాత్రం నిమ్మగ‌డ్డపై నిప్పులు చిమ్ముతూనే ఉందని ఈ తిరస్కరణ ప్రకటనతో అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: