ఏపీ కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 90 శాతం మంది క‌నీసం నోరు కూడా మెద‌ప‌ని వాళ్లే ఉన్నారు. అయితే నోరు మెదిపే వాళ్ల‌లో కూడా మంత్రి కొడాలి నాని ప్ర‌తిప‌క్షంతో పాటు ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ను... ఇటు జిల్లాకే చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమాను రాయ‌డానికి వీలులేని భాష‌లోనే తిడుతూ ఉంటారు. అటు జ‌గ‌న్ తో పాటు వైసీపీ పెద్ద‌లు కూడా సామాజిక వ‌ర్గ‌ప‌రంగా క‌మ్మ వ‌ర్గం నేత కావ‌డంతో చంద్ర‌బాబు.. టీడీపీలో ఉన్న క‌మ్మ నేత‌ల‌ను తిట్టేందుకు చ‌క్క‌గా వాడుకుంటూ ఉంటారు. ఇటు నాని సైతం వైసీపీలో మ‌రో క‌మ్మ నేత ఎద‌గ‌కుండా ఉంటే త‌న మంత్రి ప‌ద‌వి లేదా జ‌గ‌న్ వ‌ద్ద త‌న స్థానం చెక్కు చెద‌ర‌కుండా ఉంటుంద‌న్న ఆశ‌తో నోరు మెదిపితే బూతుల పంచాంగంతో విరుచుకు ప‌డుతూ ఉంటారు. అందుకే నానిని ఇటీవ‌ల ఎక్కువ మంది బూతుల మంత్రి అని ఆడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే జ‌గ‌న్ క‌మ్మ వ‌ర్గంలో నాని మ‌రీ అంత స్ట్రాంగ్ అయితే చూస్తూ ఊరుకుంటార‌ని అనుకోలేం. నానిని మ‌రీ అంత హీరోను చేస్తుంటే జ‌గ‌న్ మ‌రో రూట్లోనే ఉంటార‌న‌డంలో సందేహం లేదు. వైసీపీకి ఏకైక క‌మ్మ ఆప్ష‌న్ కొడాలి నానియే అన్నంత ఛాన్స్ జ‌గ‌న్ ఎంత మాత్రం ఇవ్వ‌రు. ఒక వేళ ప్ర‌క్షాళ‌న జ‌రిగితే క‌మ్మ కోటాలో నానిని కొన‌సాగిస్తారా ?  లేదా ? అన్న‌ది డౌటే. ఇప్ప‌టికే నాని తీరుపై పార్టీకి, ప్ర‌భుత్వానికి కొంత చెడ్డ పేరు వ‌స్తుంద‌న్న నివేదిక‌లు జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే గుంటూరుకు చెందిన క‌మ్మ నేత‌, మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను ఎమ్మెల్సీని చేసి మ‌రీ మంత్రిని చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు. దీంతో గుంటూరు క‌మ్మ‌ల‌ను సంతృప్తి ప‌ర‌చాలంటే మ‌ర్రికి న్యాయం చేయాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్‌పై ఉంది.

దీంతో నానికి స్థానిక ఎన్నిక‌లు అగ్ని ప‌రీక్ష‌గా మారానున్నాయి. స్థానిక ఎన్నిక‌ల్లో గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోని గుడివాడ‌, గుడ్ల‌వ‌ల్లేరు ... నందివాడ మండ‌లాల‌తో పాటు గుడివాడ మునిసిపాలిటీలో వైసీపీకి ఫ‌లితాలు సానుకూలంగా రాక‌పోతే నానికి జ‌గ‌న్ మార్కు షాకులు త‌ప్ప‌వ‌ని పార్టీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం గుడివాడ‌లో పేకాట స్థావరాల‌పై భారీ ఎత్తున దాడులు కూడా పై నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కు నానికి తెలియ‌కుండానే జ‌రిగాయంటున్నారు. మ‌రి నాని మాట‌ల్లో దూకుడు చూపించ‌డం కాదు.. రేపు స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటి మంత్రిగా ఉంటాడా ?  బ‌య‌ట‌కు వెళ‌తాడా ? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: