ఏపీలో జ‌రుగుతోన్న కార్పొరేష‌న్లు, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో విప‌క్ష టీడీపీకి 90 శాతం కార్పొరేష‌న్లు, మున్సిపాల్టీల్లో పెద్ద‌గా ఆశ‌లు లేవు. ఆ పార్టీకి ఆశ‌లు ఉన్న చోట్ల కూడా పార్టీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వైసీపీని గెలిపించేలా ఉన్నాయి. టీడీపీకి ఆశ ఉన్న కార్పొరేష‌న్ల‌లో విజ‌య‌వాడ ముందు వ‌రుస‌లో ఉంది. అయితే ఇక్క‌డ నాయకత్వ లోపంతో మున్సిపల్‌ కార్పొరేషన్లలో టీడీపీ ఎదురీదుతోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. విజయవాడలో నాయకుల కొరత లేకున్నా అక్కడ వర్గపోరు పతాకస్థాయికి చేరుకుంది.

కార్పొరేష‌న్ ప‌రిధిలో మూడు నియోజవకర్గలకుగాను సెంట్రల్, తూర్పులలో గట్టి నాయకత్వం ఉంది. పశ్చిమ నియోజకవర్గ వ్యవహారాన్ని బుద్దా వెంకన్న, నాగుల్ మీరా చూస్తున్నారు. వీరిలో ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌డం లేదు. ముఖ్యంగా ఎంపీ కేశినేని నాని ఎవ‌రితోనూ చెప్ప‌కుండానే త‌నంత‌ట తానే త‌న కుమార్తె శ్వేత‌ను మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకుంటోన్న ప‌రిస్థితి.

నాని తీరు న‌చ్చ‌ని మిగిలిన న‌గ‌ర నేత‌లు, ఎమ్మెల్యే గ‌ద్దె, మాజీ ఎమ్మెల్యే బొండా లాంటి వాళ్లు ఈ ఎన్నిక‌ల విష‌యంలో అంటీ ముట్ట‌న‌ట్టుగా ఉంటున్నారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌తో పాటు షేక్ నాగుల్ మీరా సైతం నానిని వ్య‌తిరేకిస్తున్నారు. దీంతో పక్కా వ్యూహాలతో.. అన్ని హంగులతో ఎన్నికలకు వెళుతున్న వైసీపీని కొట్టడం టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజీ కాదన్నది కొందరి వాదన.

పార్టీకి అన్ని సానుకూల‌త‌లో ఉన్నా కూడా నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డంతోనే ఇక్క‌డ టీడీపీ చేజేతులా ఓడి మేయ‌ర్ పీఠాన్ని వైసీపీ చేతుల్లో పెడుతుందా ? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: