ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలు రాజకీయ హీట్ పెంచుతున్నాయి. పార్టీ గుర్తులతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. అన్ని పార్టీలు సవాల్ గా తీసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ప్రచారంలోకి దిగుతున్నారు. గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. పంచాయతీ ఎన్నికలకు మించి విజయాలు సాధించేలా టీడీపీ శ్రమిస్తోంది. అటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం.. టీడీపీని చావు దెబ్బ కొట్టాలని చూస్తోంది. జిల్లాల వారీగా మంత్రులకు సీఎం జగన్ టార్గెట్ పెట్టారని తెలుస్తోంది. జనసేన-బీజేపీ కూటమి సైతం.. పుర పోరులో సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. దీంతో ఏపీలో రాజకీయ వేడి పీక్ స్టేజీకి చేరింది.

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ఉపసంహరణకు జరుగుతున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికల తరహాలోనే తమ పార్టీ అభ్యర్థులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏకగ్రీవాలు చేసుకునేందుకు దౌర్జన్యాలకు దిగుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. జగన్‌కు నిజంగా ప్రజాబలముంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరిస్తే, టీడీపీని మూసేస్తామన్నారు బుద్దా వెంకన్న. ప్రజాబలంతో టీడీపీ విజయం సాధిస్తే, వైసీపీ దుకాణం కట్టేయడానికి జగన్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న.

 తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని అడ్డుకోవడం సీఎం జగన్ పిరికిపంద చర్య అని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. దుష్టశక్తులపై పోరాడే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేయరన్నారు. చంద్రబాబే తిరిగి ఏపీకి ముఖ్యమంత్రి అవుతాడన్న భయం జగన్‌లో మొదలైందన్నారు. అందుకే ఎన్నికలు జరగకుండా దొడ్డిదారిన గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే వైసీపీకి 20 శాతం సీట్లు కూడా రావన్నారు బుద్దా వెంకన్న.




మరింత సమాచారం తెలుసుకోండి: