సాధారణ ఎన్నికలలో ఎవరో ఒక అభ్యర్థికి మాత్రమే ఓటువేసి ఒక్క అభ్యర్థినే, ఒక్క ఆలోచనను మాత్రమే బలపరచగలం. సాపేక్ష నిర్ణయాలను తెలియజేయలేం. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అభ్యర్థులను ప్రాధాన్యతా క్రమంలో ఎన్నుకోవచ్చు. దీనివల్ల వివిధ రాజకీయాలకు, ఆలోచనలకు ఎంత సపోర్ట్‌ ఉంది అనే విషయం తెలుసుకొని, ఈ ఆలోచనాపరులు, ఆ ఆలోచనలను పెంపొందించుకునే దిశా నిర్దేశాలను నిర్ణయించుకునే వీలు కలుగజేస్తుంది. మరి ఓటరు.. ఒక్కరికే కాదు.. అందరికీ ఎలా ఓటేయొచ్చో చూద్దాం.

 
సాధారణ ఎన్నికలలో చెల్లిన ఓట్లను అభ్యర్థుల పరంగా లెక్కించి ఎవరికి ఎక్కువ ఓట్లు లభించాయో వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఆ లభించిన ఓట్లు చెల్లిన ఓట్లలో ఎంత శాతం ఉన్నా ఫలితంపై ప్రభావం చూపదు. ఎన్నో సందర్భాల్లో విజేతకు 20 నుంచి 30 శాతం మాత్రమే వచ్చిన సందర్భాలున్నాయి. కాని ఈ మండలి ఎన్నికలలో చెల్లిన ఓట్లలో 50 శాతం ప్లస్‌ ఒకటి వస్తేనే విజేతగా నిర్ణయిస్తారు. ముందుగా అందరి మొదటి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించి, ఎవరికి కోటా అంటే (50 శాతం + 1) రానట్లయితే, తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగించి అతని రెండో ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుని మిగిలిన అభ్యర్థుల ఓట్లకు కలుపుతారు.


ఎవరికి కోటా రాని పక్షంలో మళ్ళీ తక్కువ ఓట్లున్న అభ్యర్థిని తొలగించి, అతని తర్వాతి ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు కలుపుతారు. ఈ ప్రక్రియ ఎవరైనా కోటా దాటే వరకు సాగుతుంది. ఈ కోటా దాటిన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. ఓట్ల విభజన విజేత నిర్ణయాన్ని మార్చదు. సాధారణ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు పెద్ద పార్టీలకు వ్యతిరేకంగా చిన్న పార్టీల ఐక్య సంఘటన కట్టి పెద్ద పార్టీని ఓడిస్తాయి. అలాకాక చిన్న పార్టీలు వేరువేరుగా పోటీచేస్తే ఓట్లు చీలిపోయి పెద్ద పార్టీ గెలుస్తుంది. కాని ఈ ఎన్నికలలో అలా జరగదు.

మరింత సమాచారం తెలుసుకోండి: