పెళ్లంటే ఒక్క రోజులో అయిపోతుంది. గొప్పవాళ్ల ఇంట్లో కనీసం ఐదు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి. జీవితం లో పెళ్లంటే మరపురాని వేడుక కాబట్టి ఎంతో ఘనం గా జరుపుతారు. అయితే, ఓ వరుడు ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు. తాను పెళ్లాడిన యువతికి మూడు సార్లు విడాకులిచ్చి మరీ మళ్లీ ఆమెనే పెళ్లాడాడు. అదే మహిళను అన్నిసార్లు పెళ్లి చేసుకోవడం, మళ్లీ విడాకులు ఇవ్వడం, ఈ తతంగమంతా ఎందుకు అనే అనుమానం కలగక మానదు.

ఇదంతా కేవలం సెలవుల కోసం అతను వేసిన ప్లానే. పెళ్లికి సెలవులు తీసుకునే అవకాశం ఉండటం తో దానిని ఓ బ్యాంక్‌ ఉద్యోగి ఇలా వినియోగించుకున్నాడు. తైవాన్‌ లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియా లో ట్రెండింగ్‌ అవుతోంది. తైవాన్‌ రాజధాని తాయ్‌పెయ్‌ నగరంలో ఓ బ్యాంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న వ్యక్తి సుమారు నెల రోజుల వ్యవధిలో ఒకే మహిళను 4 సార్లు పెళ్లి చేసుకున్నాడు. కేవలం తన సంస్థ నుంచి సెలవు పొడిగింపు కోసమే అతనీ పని చేశాడు.

తైవాన్‌ కార్మిక చట్టం ప్రకారం ఏ ఉద్యోగికైనా పెళ్లికి 8 రోజుల సెలవు తప్పనిసరిగా ఇవ్వాలి. దీన్ని సాకుగా చూపి ఈ పెళ్లి స్టంట్‌ చేశాడు. సంస్థ మంజూరు చేసిన 8 రోజుల సెలవులతో అతను సంతృప్తి చెందలేదు. ఎక్కువ రోజులు సెలవు కావాలనుకున్నాడు. దీంతో అతను తన భార్యకు విడాకులు ఇవ్వడం.. మళ్లీ పెళ్లి చేసుకోవం.. ఇలా సెలవుల కోసం దరఖాస్తు చేశాడు. అందుకుగాను మొత్తం 32 రోజుల కోసం లీవ్‌ అప్లై చేశాడు. అయితే అతను పనిచేస్తున్న బ్యాంక్‌ వారు ఈ విషయాన్ని పసిగట్టి అతనికి లీవ్‌ను పొడిగించేందుకు నిరాకరించారు. దీంతో సదరు వ్యక్తి కోర్టుకెక్కాడు. దీంతో ఈ విషయం కాస్త వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: