
ఇక ఇందులో పాల్గొన్న మాజీ ఆర్ధిక మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి రేటు గణనీయంగా పడిపోయందని మైనస్ వృద్ధిరేటులో ప్రస్తుత ప్రభుత్వం ఉందని, 2020-21 సంవత్సరంలో ఆర్థికాభివృద్ధి రేటు మైనస్ 5 శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని మాట్లాడారు. రాష్ట్ర అర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు.
ఇక తెచ్చిన అప్పులు కట్టడానికి రానున్న రోజుల్లో లక్ష కోట్లకు పైగా అవసరం ఏర్పడుతుందని, అప్పులు తీర్చటానికే మళ్లీ అప్పులు చేయాల్సి ఉంటుందని, భవిష్యత్తులో అభివృద్ధి అనేది లేకుండా ఆర్థిక సంక్షోభం, రెవెన్యూ సంక్షోభంతోనే ప్రభుత్వం నడవాల్సి ఉంటుందని విమర్శలు చేశారు. అయితే జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడేలా సంక్షేమ పథకాలకు పెద్ద పీఠ వేశారు. ఈ పథకాల వల్ల ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరుగుతుంది.
అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా రెవెన్యూ లోటు ఎక్కువగానే ఉంది. అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు బడ్జెట్‌లో అంకెల గారడీనే చేశారని వైసీపీ విమర్శిస్తుంది. పైగా అభివృద్ధి కాగితాలకే పరిమితమైందని, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు టోకరా వేశారని, దీనికి తోడు యనమల, తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల చిల్లర ఖర్చులని సైతం రాష్ట్ర ప్రభుత్వ సొమ్మునే వాడారని, అటు నారా లోకేష్ చాక్లెట్లు, బిస్కెట్లు, ఇతర స్నాక్స్ ఖర్చు ప్రభుత్వ సోమ్మే అని వైసీపీ కౌంటర్లు ఇస్తుంది. యనమల ఆర్ధిక మంత్రిగా ఉండి ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారని విమర్శించారు.