చంద్రబాబు అధికారంలో ఉండగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలనీ ఇష్టారాజ్యంగా టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అలాగే వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలని సైతం చేర్చుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో అరకు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కిడారి సర్వేశ్వరరావుని సైతం టీడీపీలో చేర్చుకున్నారు.


ఇక టీడీపీలోకి వచ్చిన కొన్నిరోజులకు మావోయిస్టుల కాల్పుల్లో సర్వేశ్వరరావు మృతి చెందారు. టీడీపీ నేత సివేరి సోమ సైతం ఈ కాల్పుల్లో మరణించారు. సర్వేశ్వరరావు 2019 ఎన్నికలకు ఏడాది లోపే మరణించారు. దీంతో అరకు స్థానానికి ఉపఎన్నిక రాలేదు. అయితే చంద్రబాబు, సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్ కుమార్‌కు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవి తీసుకుని ఆరు నెలల్లో ఎమ్మెల్సీ గానీ, ఎమ్మెల్యేగానీ శ్రావణ్ కాలేదు. దీంతో ఎన్నికల ముందు శ్రావణ్ మంత్రి పదవికి రాజీనామా చేసేశారు.


2019 ఎన్నికల్లో శ్రావణ్‌కు అరకు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. కానీ జగన్ వేవ్‌లో శ్రావణ్ డిపాజిట్లు కూడా కోల్పోయారు. రాష్ట్రం మొత్తంలో టీడీపీ డిపాజిట్ కోల్పోయింది ఒక్క అరకులోనే. వైసీపీ తరుపున పోటీ చేసిన చెట్టి ఫాల్గుణ భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దొన్ను దొర 27 వేల ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచారు. ఇక శ్రావణ్ 20 వేల ఓట్లు కూడా తెచ్చుకోలేదు.


ఇలా డిపాజిట్ కోల్పోయిన సరే శ్రావణ్, కొన్నిరోజులు టీడీపీలో యాక్టివ్‌గానే తిరిగారు. మొదట్లో వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేశారు. నియోజకవర్గంలో పార్టీ తరుపున పలు కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండేవారు. కానీ గతేడాది నుంచి శ్రావణ్ పార్టీలో కనిపించడం లేదు. అటు సోషల్ మీడియాలో సైతం అడ్రెస్ లేరు. పైగా అరకులో టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదు. దీంతో శ్రావణ్ సైకిల్ దిగిపోయినట్లే కనిపిస్తోంది. చూడాలి మరి శ్రావణ్ పోలిటికల్ కెరీర్ ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: