తెలంగాణ‌లో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పేర్లు మార్చే ప్ర‌క్రియ‌కు ఎప్పుడు ఫుల్ స్టాప్ ప‌డుతుందో ?  కూడా అర్థం కావ‌డం లేదు. కేసీఆర్ తెలంగాణ సీఎం అయ్యాక 10 జిల్లాల తెలంగాణ‌ను 33 జిల్లాలు చేసేశారు. ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్ జిల్లాను విభ‌జించి కొత్త‌గా మాజీ ప్ర‌ధాన మంత్రి పీవీ న‌ర‌సింహారావు పేరుతో మ‌రో కొత్త జిల్లా ఏర్పాటు చేయాల‌న్న ప్ర‌తిపాద‌న తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపించింది. ఈ ప్ర‌తిపాద‌న ఇలా ఉండ‌గానే ఇప్పుడు మ‌రో కొత్త జిల్లా ఏర్ప‌డ‌బోతోంద‌న్న చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి. అయితే అది కొత్త జిల్లా కాదు.. రాణి రుద్ర‌మ జిల్లాగా ఓ జిల్లా పేరును మార్చాల‌న్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు స‌మ‌యంలో కేసీఆర్ ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభ‌జించారు. ముందుగా వ‌రంగ‌ల్ రూర‌ల్, వ‌రంగ‌ల్ అర్బ‌న్, జ‌న‌గాం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, మ‌హ‌బూబాబాద్ జిల్లాలుగా విభ‌జించారు. త‌ర్వాత కేసీఆర్ ఇచ్చిన హామీ మేర‌కు మ‌ళ్లీ ములుగు జిల్లాను కూడా విభ‌జించారు. దీంతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఇప్పుడు ఆరు జిల్లాలుగా రూపాంత‌రం చెందింది. కాక‌తీయుల రాజ‌ధానిగా ఘ‌ణ‌చ‌రిత్ర ఉన్న వ‌రంగ‌ల్ లోని ప్రాంతాలు వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా ప‌రిధిలోకి వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు స్థానికంగా కొత్త డిమాండ్ వ‌స్తోంది. ఎంతో చారిత్ర‌క ప్రాధాన్యం ఉన్న హ‌న్మ‌కొండ పేరు లేకుండా పోయింది. హ‌న్మ‌కొండ ఎంపీ సీటు కూడా ర‌ద్ద‌య్యింది. దీంతో ఇప్పుడు వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లాను హ‌న్మ‌కొండ జిల్లా లేదా రాణి రుద్ర‌మ జిల్లాగా పేరు మార్చాల‌ని స్థానికంగా డిమాండ్లు వ‌స్తుండ‌డంతో... అక్క‌డ ఉన్న రాజ‌కీయ నాయ‌కులు సైతం ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరు మార్పుపై మంత్రి ఎర్ర‌బెల్లి సైతం ధృవీక‌రించారు. ఇక అటు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ముందే పీవీ న‌ర‌సింహారావు జిల్లా కూడా ఏర్ప‌డ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: