కరోనా వైరస్‌ కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్ని చాలా డేంజరస్‌గా మారుతున్నాయి. నిన్న మొన్న డెల్టా వేరియంట్ హడలెత్తించింది. అనేక దేశాల్లో కరోనా కేసులు పెరిగేందుకు ఇదే కారణమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. ఆ తరవాత డెల్టా వేరియంట్ రకం ఇంకా వేగంగా వ్యాపిస్తోందని గుర్తించారు. ఈ వైరస్ వచ్చిన వ్యక్తి పక్క నుంచి నడిచినా కూడా కరోనా వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.

ఇక ఇప్పుడు మరో కొత్త వేరియంట్ హడలెత్తిస్తోంది. అదే లాంబ్డా అనే వేరియంట్‌.. ఇది కూడా వేగంగా  అనేక దేశాల్లో విస్తరిస్తోందట. అందుకే డబ్ల్యూహెచ్‌ఓ  దీన్ని దృష్టిసారించాల్సిన వైరస్‌ రకం అని ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌ఓ మాత్రమే కాదు.. బ్రిటన్‌లోని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ కూడా దీని గురించి అప్రమత్తం చేస్తోంది. ఈ లాంబ్డా వైరస్‌ను పరిశోధనలో ఉన్న కరోనా రకం అంటూ వర్ణించింది. ఈ లాంబ్డా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంతే కాదు..  దీని స్పైక్‌ ప్రొటీన్‌లో ఎల్‌452క్యూ, ఎఫ్‌490ఎస్‌ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్నాయి.


ఇక ఈ లాంబ్డా వైరస్‌ కేసులు బ్రిటన్‌లో ఇప్పటివరకూ ఆరు గుర్తించారట. వాస్తవానికి ఇది మొదట గత ఏడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్‌, అర్జెంటీనా సహా 29 దేశాలకు ఈ లాంబ్డా వైరస్ వేరియంట్ విస్తరించింది. ఏప్రిల్‌ నుంచి పెరూలో బయటపడిన కొవిడ్‌ కేసుల్లో ఈ వేరియంట్‌ వాటా 81 శాతం మేర ఉందట. రెండు నెలల్లోనే ఇది చిలీలో 32 శాతానికి పెరిగిందట. ఈ వేరియంట్‌ వల్ల తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ వస్తుందనడానికి గానీ, ప్రస్తుత టీకాలను ఇది ఏమారుస్తుందనడానికి గానీ ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ చెబుతోంది.


అలాగని దీన్ని లైట్ గా తీసుకోవడానికి వీలు లేదు. దీని స్పైక్‌ ప్రొటీన్‌లోని కొన్ని ఉత్పరివర్తనాల వల్ల ఇది ఉద్ధృతంగా వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు సైంటిస్టులు ఈ లాంబ్డా వైరస్‌ వేరియంట్ పై పరిశోధనలు పెంచారు. ఇలా ఇంకెన్ని వైరస్‌ వేరియంట్లు వస్తాయో.. ఈ కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి ఎప్పుడో..?

మరింత సమాచారం తెలుసుకోండి: