కృష్ణా జిల్లా.. ఆంధ్రప్రదేశ్‌లోనే కీలకమైన జిల్లా.. రాష్ట్రానికి మధ్యలో ఉన్న జిల్లా.. విజయవాడ వంటి చైతన్యవంతమైన జిల్లా.. అలాంటి ప్రాంతాన్ని రాజధాని చేద్దామని చంద్రబాబు ఎంతగానో కలలు కన్నారు. విజయవాడ- గుంటూరు ప్రాంతాన్ని ప్రపంచంలోనే భేషనైన నగరంగా తీర్చిదిద్దుతా అన్నారు.  కానీ.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును చివరకు ఈ జిల్లావాసులు కూడా ఘోరంగా ఓడించారు. దీనిపై ఇటీవల చంద్రబాబు తరచూ తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


చివరకు కృష్ణా జిల్లా ప్రజలకు కూడా తనను ఓడించారని వాపోతున్నారు చంద్రబాబు.. కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తే తనకు జిల్లా ప్రజలు ఓటు వేయలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయితే కృష్ణా జిల్లాపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదంటున్నారు వైసీపీ మంత్రి పేర్ని నాని. మీకు అన్నం పెడితే కృష్ణాజిల్లా ప్రజలు నా చేయి కరిచారని మాట్లాడతారా? ఎంత దౌర్బాగ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు  2014లో సీఎం అయ్యేవరకూ కృష్ణాడెల్టాలో రెండు పంటలు పండించిన ఘనత ఇక్కడి రైతులదని గుర్తు చేశారు.


చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే.. కృష్ణా డెల్టా  రెండు పంటలను ఒక పంట చేశారని.. చంద్రబాబు అయిదేళ్లలో దాళ్వా పంటకు నీళ్లు ఇచ్చారా? అని పేర్ని నాని ప్రశ్నించారు.  కృష్ణాడెల్టా రైతులకు చంద్రబాబు సున్నం పూసి.. ఇప్పుడు అసత్యాలు మాట్లాడుతున్నారని పేర్ని అంటున్నారు.  అందుకే ప్రజలు గట్టిగా మీకు కారం పూశారని.. కృష్ణాడెల్టా రైతుల నోళ్లు కొట్టి రాయలసీమకు నీళ్లు ఇచ్చామని చంద్రబాబు చెబుతున్నారని.. నిజంగా ఆ ప్రాంతానికి నీళ్లు ఇస్తే సీమ ప్రజలు ఎందుకు ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడిస్తారని పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు.


అయిదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయంలో బందర్‌ పోర్టును ఏం చేశారని పేర్ని ప్రశ్నించారు.  కాలయాపన చేసి, మళ్లీ ఓట్లు అడిగేటప్పుడు మార్చిలో ఎన్నికలు అయితే... ఫిబ్రవరి 7వ తేదీన మీరు వచ్చి దొంగ శంకుస్థాపన చేస్తారా? అని నిలదీశారు. ఎవర్ని మోసం చేద్దామని చంద్రబాబు ఇలా చేశారు..  బందర్‌ వాసుల్ని మోసం చేద్దామనా? కృష్ణా జిల్లా వాసులను వంచన చేసి, వెన్నుపోటు పొడిచి ఈ రకంగా మాట్లాడతారా అంటున్నారు పేర్ని నాని.


మరింత సమాచారం తెలుసుకోండి: