ఏపీలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా, ఆ పార్లమెంట్ స్థానాల పరిధిలో అధికార వైసీపీ పూర్తి ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా అన్ని స్థానాల్లోనూ వైసిపి ఆధిపత్యం ఉంది. అయితే వైసీపీ ఆధిపత్యం తగ్గించడానికి ప్రతిపక్ష టిడిపి ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తుంది. ఎక్కడకక్కడ అధికార వైసిపి ఆధిక్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. అలాగే సమన్వయకర్తలని పెట్టారు. అటు ప్రతి నియోజకవర్గంలో బలమైన నాయకులని లీడర్లుగా పెడుతున్నారు. ఇలా ప్రతి స్థానంలోనూ టిడిపి సత్తా చాటాలనే ఉద్దేశంతో నాయకుల్ని పెట్టారు. మరి ఆ నాయకుల వల్ల టిడిపికి ఎంత బెనిఫిట్ అవుతుంది? వారు వైసీపీ ఆధిక్యం తగ్గించారా?  అనే విషయాలని ఒకసారి గమనిస్తే చాలావరకూ వైసీపీ ఆధిక్యం తగ్గించడంలో టిడిపి నేతలు విఫలమైనట్లు కనిపిస్తుంది.

ఎందుకంటే 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ ఒక్క పార్లమెంట్ స్థానంలోనూ టిడిపికి ఆధిక్యం వచ్చినట్లు కనిపించడం లేదు. ఒకో పార్లమెంటు స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ప్రతి పార్లమెంటు స్థానంలోనూ మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఎక్కడా టిడిపికి పెద్ద పట్టు చిక్కినట్లు కనిపించడం లేదు. కాకపోతే కొద్దో గొప్ప ఏలూరు, విజయవాడ, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాస్త టిడిపి పుంజుకున్నట్లు కనిపిస్తుంది. అలా అని పూర్తి స్థాయిలో మాత్రం బల పడలేదు.

అయితే ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ల సమయం పైనే ఉంది కాబట్టి, ఇంకా కొన్ని స్థానాల్లో టిడిపికి పట్టు చిక్కే అవకాశం ఉంది. అలాగే మిగిలిన స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వస్తే, అక్కడ టిడిపి నేతలు బలపడితే ఇంకొంచెం టీడీపీకి ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: