పిల్లలను ఉన్నత చదువులు చదవించాలన్న కోరిక లేని తల్లిదండ్రులు ఉండరు. కానీ అందరికీ ఉన్నత విద్యలు చదవించడం కుదరదు. కానీ అవకాశం ఉన్నవారు మాత్రం లక్షలు పోసి మరీ చదివిస్తుంటారు. ఇక ఐఐటీ, ఐఐఎంలలో తమ పిల్లలను చదవాలని ఆశపడే తల్లిదండ్రులు లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. అయినా సరే.. ఖర్చుకు వెనుకాడని తల్లిదండ్రులను కొన్ని విద్యాసంస్థలు నిలువునా దగా చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని అలాంటి ఓ సంస్థకు వినియోగదారుల ఫోరమ్ షాక్ ఇచ్చింది.


అసలేమైందంటే.. హైదరాబాద్‌లోని ఫిట్‌ జీ అనే సంస్థ.. కోచింగ్ ఇస్తోంది. ఫిట్‌జీ పినాకిల్  పేరిట ఈ కోచింగ్ కోర్సు ఉంది. ఇందులో చేరాలంటే 4 లక్షలకు పైగా కట్టాలి. ఇది రెండేళ్ల కోర్సు.. ఈ కోర్సు మొత్తం ఫీజు ప్రారంభంలోనే కట్టాలి. కోర్సు మొదలయ్యాక మాకు కోచింగ్ నచ్చలేదు అంటే ఒప్పుకోరు. అంతగా నచ్చకపోతే.. నోరు మూసుకుని వెళ్లిపోవడమే తప్ప.. కోర్సు ఫీజు కట్టిన దాంట్లో పైసా వెనక్కు ఇవ్వరు. అంతే కాదు.. అలాగని ముందుగానే ఒప్పందంపై సంతకాలు తీసుకుంటారు.


తాజాగా ఓ విద్యార్థి ఇలాగే 4 లక్షలు కట్టి కోర్సులో చేరాడు. కానీ నెల కూడా గడవక ముందే.. ఆ విద్యార్థికి అక్కడి బోధన ఏమాత్రం నచ్చలేదు. అంత ఖర్చు చేస్తున్నా చక్కగా బోధించడం లేదని ఫిర్యాదు చేశాడు. అలా అయితే వెళ్లిపో.. అన్నది యాజమాన్యం.. ఫీజు వెనక్కి ఇవ్వాలని విద్యార్థి తండ్రి డిమాండ్ చేశాడు. కానీ ఆ సంస్థ ఫీజు ఇవ్వబోమని ముందే చెప్పాం కదా అంటూ ఒప్పందం చూపింది. దీంతో ఆ తండ్రి హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు.


ఈ కేసును విచారించిన ఫోరమ్‌ ఫిట్‌జీ  సంస్థ తీరును తప్పుబట్టింది. సీటు రద్దు చేసుకున్న విద్యార్థికి ఫీజు తిరిగివ్వాల్సిందేనని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. కోర్సు మొత్తం ఫీజు మొదటే తీసుకోవడాన్ని తప్పుపట్టింది. ఫీజు వివాదం వినియోగదారుల కమిషన్ పరిధిలోకి రాదన్న ఫిట్‌జీ వాదించినా కమిషన్ అంగీకరించలేదు. విద్యార్థికి రూ.4.35 లక్షల ఫీజు, రూ.50 వేలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థికి ఫీజు 45 రోజుల్లో చెల్లించకుంటే 9 శాతం వడ్డీ కూడా ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: