క‌ర్ణాట‌కీయం ముగిసిన అనంత‌రం కొత్త మంత్రుల ఎంపిక విష‌యంలో బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ సీఎం య‌డియూర‌ప్ప బ‌స‌వ‌రాజు బొమ్మైకి ప‌లు స‌ల‌హాలు ఇచ్చాడు. పార్టీ బలోపేతం కోసం తన కృషి కొనసాగుతుందని అయితే మంత్రుల ఎంపిక‌లో త‌న జోక్యం ఉండ‌బోద‌ని పున‌రుద్ఘాటించారు య‌డ్డీ. పార్టీ అధినాయకత్వంతో సంప్రదించి కొత్త మంత్రులను తీసుకునే పూర్తి స్వేచ్ఛ సీఎం బొమ్మైకే ఉంటుందని పేర్కొన్నారు. తన రాజీనామా వార్తతో కలత చెంది గుండ్లుపేట తాలూక బొమ్మలపుర గ్రామానికి చెందిన అభిమ‌ని రవి ఆత్మహత్యకు పాల్పడగా.. అతడి కుటుంబాన్ని య‌డ్డీ శుక్రవారం పరామర్శించారు. ఆత్మహత్య ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. ఆ కుటుంబాన్ని ఓదార్చి రూ.5లక్షల సాయం అందించారు. మృతుడి కుటుంబానికి భ‌రోసా ఇచ్చారు.

 అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బసవరాజ్‌ బొమ్మై ప్రస్తుతం దిల్లీలోనే ఉన్నార‌ని కొద్ది రోజుల్లో ఆయన కేంద్ర నాయకత్వంతో చర్చించి కొత్త కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే నిర్ణయం తీసుకుంటార‌ని తెలిపారు. ఈ విషయంలో బొమ్మూకే పూర్తి స్వేచ్చ ఉంటుద‌ని త‌న‌ జోక్యం, ఎలాంటి సూచ‌న‌లు ఉండ‌వ‌ని చెప్పారు. బాగా పనిచేయాలని మాత్రమే కొత్త సీఎంకు సలహా ఇస్తాన‌ని, ఇప్పటికే పేదలు, అట్టడుగు వర్గాలకు సాయం చేయడమే లక్ష్యంగా కొన్ని ప్రకటనలు చేశారు అని య‌డ్డీ తెలిపారు.  

2019లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నుంచి బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యేల పరిస్థితిపై ప్రశ్నించగా.. ఆ విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చించి బొమ్మై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పార్టీ బ‌లోపేతానికి కృషి చేసేందుకు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తానని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షా,  పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు హామీ ఇచ్చాన‌ని య‌డియూర‌ప్ప వివ‌రించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో 130 కి పైగా స్థానాలు గెలుపొందుతామ‌ని దీమా వ్య‌క్తం చేశారు.

అయితే, క‌ర్ణాట‌క‌ సీఎం బసవరాజ్‌ బొమ్మై ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర పెద్దల క‌లిసేందుకు ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇదే స‌మ‌యంలో నూత‌న కేబినెట్‌లో బెర్త్‌ దక్కించుకొనేందుకు ఆశావహులు లాబీయింగ్‌ల‌ను కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: