దేశానికి సంబంధించిన ప‌రిపాల‌న అంతా ప్ర‌ధాన‌మంత్రి చూసుకుంటారు. ఆయ‌న‌కు సంబంధించిన విష‌యాల‌న్నింటినీ ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం చూసుకుంటుంది. దేశ ప‌రిపాల‌న‌లో ప్ర‌ధాన‌మంత్రి స‌ల‌హాలిస్తూ అత్యంత కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం (పీఎంవో) తాజాగా వార్త‌ల్లో నిలిచింది. ప్ర‌ధాన‌మంత్రికి స‌ల‌హాదారులుగా ప‌నిచేస్తున్న ఇద్ద‌రు కీల‌క వ్య‌క్త‌లు నెల‌రోజుల వ్య‌వ‌ధిలోనే రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

అక‌స్మాత్తుగా రాజీనామా చేసిన అమ‌ర్జిత్‌
నరేంద్ర మోడీ కార్యాలయం (పీఎంవో)లో సీనియర్‌ అధికారి అమర్జిత్ సింగ్ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక‌స్మాత్తుగా ఆయ‌న తన పదవికి రాజీనామా చేశారు. సామాజిక సంబంధమైన వ్యవహరాల‌న్నింటినీ అమ‌ర్జిత్ ప‌ర్య‌వేక్షించేవారు. 1983 బీహార్ క్యాడ‌ర్‌కు చెందిన అమ‌ర్జిత్ ఐఏఎస్ అధికారి. గ్రామీణాభివృద్ధి కార్య‌ద‌ర్శిగా 2019లో ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. అనంత‌రం రెండు సంవ‌త్స‌రాల‌పాటు ప‌ద‌విలో ఉండేలా 2020 ఫిబ్ర‌వ‌రిలో పీఎంవో స‌ల‌హాదారుగా నియ‌మితుల‌య్యారు. అయితే పదవీ కాలం  ఏడు నెలలు మిగిలి ఉండగానే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. పీఎంవోలో ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌గా పనిచేసిన పీకే సిన్హా కూడా రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రాజీనామా చేసిన కొద్దికాలానికే అమ‌ర్జిత్ కూడా అదేబాట‌లో ప‌య‌నించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే రాజీనామాకు ఆయ‌న కార‌ణాలు పేర్కొన‌లేదు. కొద్దిరోజుల కింద‌ట రాజీనామా చేసిన పీకే సిన్హా కూడా త‌న రాజీనామాకు కార‌ణాలు పేర్కొన‌లేదు.

పీఎంవోపై ఇటీవ‌లి కాలంలో పెరిగిన విమ‌ర్శ‌లు
ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యంలోని అధికారుల‌పై ఇటీవ‌ల కాలంలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. న‌రేంద్ర‌మోడీని త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నార‌ని, స‌ల‌హాలు, సూచ‌న‌లు దేశ ఆర్థికాభివృద్ధికికానీ, సామాజికాభివృద్ధికికానీ ఏవిధంగా తోడ్ప‌డేట‌ట్లు లేవ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ అయితే న‌రేంద్ర‌మోడీతోపాటు ఆయ‌న కార్యాల‌య సిబ్బందిపైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. కొవిడ్ క‌ట్ట‌డిలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మ‌వ‌డంతో వ‌స్తున్న విమ‌ర్శ‌ల ఒత్తిడిని త‌ట్టుకోలేకే ఈ ఇద్ద‌రు స‌ల‌హాదారులు రాజీనామా చేసివుంటారనే వ్యాఖ్య‌లు విన‌వ‌స్తున్నాయి. ఎందుకు రాజీనామా చేశార‌నేది వారికే తెలియాలి మ‌రి.. లేదంటే ప్ర‌ధాన‌మంత్రిక‌న్నా తెలిసివుండాలి..!!





మరింత సమాచారం తెలుసుకోండి:

tag