మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకి అర్జంట్‌గా తీసుకోవాల్సిన చర్యలను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మత్తులపై రాష్ట్ర నీటిపారుదలశాఖకు మధ్యంతర నివేదిక ఇచ్చింది. మేడిగడ్డని 2019 జూన్ లో ప్రారంభించి నీరు నిల్వచేసిన తర్వాత వర్షాకాలం ముగిశాక ఆనకట్ట దిగువన సీసీబ్లాక్స్, ఆప్రాన్ దెబ్బతిన్నట్లు పేర్కొంది.

ప్రస్తుత పరిస్థితుల్లో 7వబ్లాక్‌కి ఏ మరమ్మత్తులు చేపట్టినా తాత్కాలికం మాత్రమేనని అవి చేసినా అనూహ్య కదలికలు, మార్పులు జరిగే అవకాశం లేకపోలేదని పేర్కొంది. పియర్స్, రాప్ట్‌ఫ్లోర్‌కి వచ్చిన పగుళ్లను ఎప్పటికప్పుడు గమనించాలని మరింత పెరగకుండా 16 నుంచి 22వ పియర్స్‌కి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కమిటీ సూచించింది. దెబ్బతిన్న, కదలిన ప్లింత్ స్లాబ్‌లు తొలగించి రివర్ బెడ్‌సరిగా ఉండేలా చూడాలని.. 7బ్లాక్‌లో దెబ్బతిన్న రాఫ్ట్, ప్లింత్ స్లాబ్ ఎదుట ఇసుక సంచులు ఏర్పాటుచేసి, కాంక్రీట్ వేయాలని పేర్కొంది.


ప్లింత్ స్లాబ్ దిగువన 9 మీటర్ల లోతు వరకు షీట్‌పైల్ ఏర్పాటు చేయాలన్న కమిటీ... బాయిలింగ్ పాయింట్స్‌ను కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి ఆ తర్వాత అన్నింటికి గ్రౌటింగ్ చేయాలని తెలిపింది.బ్యారేజీ, గేట్లపై నీటిఒత్తిడి పడకుండా వర్షాకాలం కంటె ముందే ఏడో బ్లాక్ లోని అన్ని గేట్లను పూర్తిగా తెరవాలని, అంతకుముందే గేట్లు అన్నింటినీ పూర్తి స్థాయిలో తనిఖీ చేసుకోవాలని కమిటీ సూచించింది. ఆ ప్రక్రియలో గ్యాంట్రీ క్రేన్‌ను ఏడో బ్లాక్ మినహా ఇతర బ్లాకుల్లో మాత్రమే ఉంచాలని పేర్కొంది. పగుళ్లు వచ్చిన పియర్స్‌కు గేట్లను తెరవడం కంటె ముందే రక్షణ చర్యలుచేపట్టాలని తెలిపింది.


20వ పియర్‌కు ఇరువైపులా ఉన్న 20, 21 గేట్లకు గరిష్ట నష్టం జరిగినందున వాటిని కటింగ్ చేసి పూర్తిగా తొలగించాలని స్పష్టం చేసింది. మిగిలిన ఆరు గేట్లను పూర్తిగా ఎత్తాలన్న కమిటీ... ఒకవేళ సాధ్యం కాకపోతే వాటిని పూర్తిగా తొలగించాలని తెలిపింది. ఏడో బ్లాక్‌ఎగువన, దిగువన ఉన్న సీసీబ్లాకుల్లో దెబ్బతిన్న వాటిని తొలగించి.. రివర్ సరిగ్గా ఉండేలా చర్యలు చేపట్టాలని.. ఎక్కడైనా బాయిలింగ్ గుర్తిస్తే ఇసుక ద్వారా అరికట్టి ఇన్‌వర్టెడ్ ఫిల్టర్, సీసీ బ్లాకులు వేయాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: