- మైల‌వ‌రంలో తిరుప‌తిరావు, క‌నిగిరిలో నారాయ‌ణకు జ‌గ‌న్ ఎమ్మెల్యే సీట్లు
- ఇద్ద‌రూ జ‌డ్పీటీసీలే.. అనూహ్యంగా ఎమ్మెల్యే టిక్కెట్‌
- మైల‌వ‌రంలో క‌మ్మ‌, క‌నిగిరిలో రెడ్డి నేత‌ల‌పై పోటీ

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

వారిద్ద‌రు అతి సామాన్యులు.. అతి సామాన్యులుగానే వారి రాజ‌కీయం ప్రారంభ‌మైంది. ఇద్ద‌రూ కూడా వైసీపీ నుంచి జ‌డ్పీటీసీలుగా ఉన్నారు. అయితే జ‌గ‌న్ అనూహ్యంగా వారిద్ద‌రికి ఏకంగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేశారు. ఆర్థికంగా వీరి చేతిలో పైసా లేదు. కానీ జ‌గ‌న్ సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా రెండు కీల‌క‌మైన అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో వీరికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి మొత్తం తానై న‌డిపిస్తున్నారు. ఆ ఇద్ద‌రు యాద‌వ సామాజిక వ‌ర్గానికి చెందిన వారే. మైల‌వ‌రం వైసీపీ అభ్య‌ర్థి స‌ర్నాల తిరుప‌తిరావు యాద‌వ్‌, క‌నిగిరి వైసీపీ అభ్య‌ర్థి ద‌ద్దాల నారాయ‌ణ యాద‌వ్‌.


వీరిద్ద‌రు 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో సాధార‌ణ ఓట‌ర్లు మాత్ర‌మే. పార్టీ అధికారంలోకి వ‌చ్చాక సాధార‌ణ కార్య‌క‌ర్త‌లు.. నేడు అదే ఇద్ద‌రు ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే క్యాండెట్లు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రు వైసీపీ నుంచి జ‌డ్పీటీసీలు అయ్యారు. తిరుప‌తిరావు మైల‌వ‌రం జ‌డ్పీటీసీగా, తిరుప‌తిరావు క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గం లోని హ‌నుమంతునిపాడు జ‌డ్పీటీసీగా గెలిచారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల్లో భాగంగా యాద‌వ వ‌ర్గానికి మైల‌వ‌రం, క‌నిగిరి సీట్లు ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు.


ఈ క్ర‌మంలోనే మైల‌వ‌రంలో తిరుప‌తిరావు యాద‌వ్‌కు, క‌నిగిరి సీటు నారాయ‌ణ యాద‌వ్‌కు ఇచ్చారు. వీరికి ఒంటిమీద వేసుకోవ‌డానికి బ‌ట్ట‌లు, కాళ్ల‌కు చెప్పులు త‌ప్పా చెప్పుకోద‌గ్గ ఆస్తులు కూడా లేవు. కానీ జ‌గ‌న్ అన్నీ తానే భ‌రించి మ‌రి వీళ్ల‌కు సీట్లు ఇచ్చారు. పైగా మైల‌వ‌రంలో తిరుప‌తిరావు టీడీపీ నుంచి బ‌లమైన క‌మ్మ నేత‌, ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ను ఢీ కొడుతున్నారు. అటు క‌నిగిరిలో నారాయ‌ణ టీడీపీ నుంచి రెడ్డి వ‌ర్గానికి చెందిన ముక్కు ఉగ్ర‌నర‌సింహారెడ్డితో పోటీ ప‌డుతున్నారు. నిజంగా ఈ ఇద్ద‌రు సామాన్యులు గెలిస్తే జెయింట్ కిల్ల‌ర్లు గా నిల‌వ‌డంతో పాటు యాద‌వ క‌మ్యూనిటీ స‌గ‌ర్వంగా చెప్పుకునేలా చ‌ట్ట స‌భ‌ల్లోకి అడుగు పెడ‌తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: