•జగన్ వ్యూహాత్మక రచన ఫలిస్తుందా..

•రెండు దశాబ్దాలుగా గెలుపు కోసం టీడీపీ ప్రయత్నం..

•కమ్మ సామాజిక వర్గమే టీడీపీ కి అడ్డుగా వుందా..

* తొలిసారి బీసీలకు టికెట్ ఇచ్చి సంచలనం సృష్టించిన  ప్రధాన పార్టీ..



(యాదవాంధ్రప్రదేశ్ (కందుకూరు) - ఇండియా హెరాల్డ్)

ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గాలలో యాదవ సామాజిక వర్గం కూడా ఒకటి.. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు రోజులు మాత్రమే ఎన్నికలకు మిగిలి ఉన్న నేపథ్యంలో బడా సామాజిక వర్గాలు పోటీ పడుతూ ఉండడం గమనార్హం.. ఈ నేపథ్యంలోనే భారీ బలగం ఉన్న యాదవ సామాజిక వర్గం నుండి కూడా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.. ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే ప్రజల కోసం తాము ఎలా సహాయపడతాము అన్న విషయాలను కూడా వివరిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ప్రత్యేక కథనం మేరకు యాదవాంధ్రప్రదేశ్ శీర్షికలో భాగంగా తూర్పు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైసిపి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కి స్థానికంగా బలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు ఒకసారి క్షుణ్ణంగా తెలుసుకుందాం.


తూర్పు ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం అగ్రవర్ణాలకు చెందిన సీటు. గత రెండు దశాబ్దాలుగా టిడిపి కేవలం కమ్మ సామాజిక వర్గానికే కేటాయిస్తుంది. మరొకవైపు గతంలో కాంగ్రెస్ , ఇప్పుడు వైసిపి రెడ్డి సామాజిక వర్గానికి సీటు ఇస్తున్నాయి. అయితే ఇక్కడ యాదవుల ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే జగన్ మొదటిసారి బీసీ ప్రయోగం చేశారు. అలా వైసిపి తరఫున యాదవ సామాజిక వర్గానికి చెందిన బుర్ర మధుసూదన్ యాదవ్ కి టికెట్ కేటాయించడం జరిగింది.బుర్రా మధుసూదన్ యాదవ్ విషయానికి వస్తే..  బెంగళూరులో సామాన్య కుటుంబంలో జన్మించి.. రియల్ ఎస్టేట్లోకి అడుగుపెట్టి ఆ తర్వాత 2014 కి ముందు వైసీపీతో కలిసి కందుకూరి నియోజకవర్గం నుంచి పని చేసిన ఈయన.. 2014లో కనిగిరికి వెళ్లి అక్కడ ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికల్లో ఏకంగా 40 వేల ఓట్ల మెజారిటీతో.. టిడిపి నుంచి పోటీ చేసిన  ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని ఓడించి.. ఎమ్మెల్యేగా గెలిచి.. కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.. అయితే కనిగిరిలో దద్దాల నారాయణరావు యాదవ్ కు టికెట్టు ఇవ్వడంతో మధుసూదన్ యాదవ్ కి కందుకూరు నియోజకవర్గంలో టికెట్ ఇచ్చారు.. ఇక్కడ 30 వేల యాదవ ఓట్లు ఉన్నాయి.. అలాగే మైనారిటీ,  ఎస్సీ , రెడ్డి ఓట్లతో బీసీలకు ఇస్తే గెలుస్తామన్నది జగన్ నమ్మకం. కందుకూరు నియోజకవర్గంలో ఒక ప్రధాన పార్టీ బీసీకి టికెట్ ఇవ్వడం ఇదే తొలిసారి.

ఇక టిడిపి తరఫున ఇంటూరి నాగేశ్వరరావు బరిలోకి దిగుతున్నారు ఈయన విషయానికి వస్తే.. ఈయన  స్థానికులు..గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీ కోసం పనిచేస్తున్న  ఈయనకు రెండేళ్ళ క్రితం అధిష్టానం ఇన్చార్జిగా పదవి కట్టబెట్టింది.  ప్రస్తుతం ఈయనకే అధిష్టానం టికెట్ కేటాయించింది.. దీంతో టికెట్ ఆశించిన ఇంటూరి రాజేష్ భంగపడ్డారు.. ఇక వీరిద్దరిలో గెలుపు ఎవరిది అనే విషయాన్ని పక్కన పెడితే వీరిద్దరూ కాకుండా మైదిరెడ్డి నిలబడితే ఆయనే అధికారంలోకి వస్తారు అంటూ స్థానికంగా వినిపిస్తున్న మాట.. ఎందుకంటే గత మూడు దశాబ్దాలుగా కందుకూరి నియోజకవర్గంలో రాజకీయంలో ఉన్న మైదిరెడ్డి వైసీపీ తరఫున పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు టికెట్ ఇవ్వకుండా బుర్రా మధుసూదన్ యాదవ్ కు టికెట్ కేటాయించారు.. ఇకపోతే ఇక్కడ చర్చనీయాంశం గా మారిన విషయం ఏమిటంటే.. విజయసాయి రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో వైసిపికి సపోర్టు చేస్తానని చెప్పారు కానీ అక్కడ వైసిపి కండువా కప్పుకోకపోవడంతో అభిమానులలో కాస్త ఆందోళన నెలకొంది.. ఇలాంటి సమయంలో టిడిపికి సపోర్ట్ చేస్తారా అంటే దిక్కుతోచని పరిస్థితి..

మరొకవైపు పార్లమెంటు నుండి వేమారెడ్డి సహాయం టీడీపీ అభ్యర్థికి ఉన్నా కూడా అక్కడ ఆయన గెలుస్తారన్న వార్తలు వినిపించడం లేదు.. పైగా గత 20 సంవత్సరాలుగా టిడిపి ఒక్కసారి కూడా ఇక్కడ గెలుపుని చూడలేదు.. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కమ్మ సామాజిక వర్గం వల్లే ఇక్కడ టిడిపి ఓడిపోతుందనే వార్త తెరపైకి వచ్చింది. పైగా టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే శివరాం తో పాటు ఇంటూరి రాజేష్ కారణంగా ఇక్కడ టిడిపి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ కందుకూరు నియోజకవర్గం లో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక కుల మతాలతో సంబంధం లేకుండా తాను అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఫీజు రీయంబర్స్మెంట్ పైనే ఉంటుందని .. అటు విద్యార్థులను ఇటు యువతను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.. ముఖ్యంగా తాను దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్మెంట్ కారణంగానే బీటెక్ పూర్తి చేశానని.. ఇక తాను అధికారంలోకి వస్తే కచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మరి ఇలాంటి సమయంలో కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ సొంతమవుతుందా ? లేక ఇంటూరి నాగేశ్వరరావు సొంతమవుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరొకవైపు తొలిసారి బీసీలకు టికెట్ ఇచ్చి వ్యూహాత్మక రచన చేస్తున్న జగన్ ప్రయత్నం ఫలిస్తుందా అన్నది కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: