
ఇదిలావుంటే, జగన్ అక్రమాస్తుల కేసులో సెప్టెంబరు 22వ తేదీన ఈడీ కోర్టు విచారణకు హాజరు కావాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నోటీసులు పంపింది. వాన్‌పిక్‌తో పాటు, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసులను ఈడీ కోర్టు విచారణకు స్వీకరించింది. నిన్నమొన్నటి దాకా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, సీబీఐ కేసులు మొదటి విచారణ జరపాలని, ఆ తర్వాతనే ఈడీ కేసులు విచారణ నిర్వహించాలని హైకోర్టులో వేసిన పిటీషన్‌ను కొట్టి వేయడంతో ఈడీ విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది. దీంతో ఈడీ సెప్టెంబరు 22న జగన్‌తో పాటు మరో 22మందికి కోర్టుకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడాన్ని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. కోర్టు విచారణకు గైర్హాజరు అయ్యేందుకు అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపించబోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. ఈడీ కోర్టు విచారణ అనగానే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తారని ఆయన విమర్శించారు. మొత్తం మీద అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో తెలుగుదేశం ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళుతుందో చూడాలి.