హుజూరాబాద్ ఉఫఎన్నిక షెడ్యూల్ విడుదలయింది. అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 8వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 30న పోలింగ్.. నవంబర్ 2న కౌంటింగ్ జరుగనుంది. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో ఉపఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్ తో పాటు ఏపీలోని బద్వేలు అసెంబ్లీ స్థానానికి కూడా ఇదే షెడ్యూల్ ఉండనుంది. ఉపఎన్నిక వేళ ఈసీ కొన్ని నిబంధనలు విధించింది. కరోనాను దృష్టిలో ఉంచుకొని వెయ్యిమందితోనే సభలకు అనుమతి ఇచ్చింది. ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది.

హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ఇప్పటికే బరిలో నిలిపారు. 2021 ఆగస్ట్ 11న సీఎం కేసీఆర్ స్వయంగా అభ్యర్థిని ప్రకటించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. గెల్లు శ్రీనివాస్ ఒక విద్యార్థి నాయకుడు. విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా, వీణవంక మండలంలోని హిమ్మత్ గ్రామానికి చెందిన వారు. వీణవంకలో ప్రాథమిక విద్య, అంబర్ పేట ప్రభుత్వ బీసీ హాస్టల్ లో ఉంటూ ఏవీ కాలేజీలో బీఏ కంప్లీట్ చేశారు. తెలుగు యూనివర్సిటీలో ఎంఏ, ఓయూలో బీఏ కంప్లీట్ చేశారు. ఎల్ ఎల్ బీ పట్టా కూడా అందుకున్నారు.

గతంలో ఆర్ కృష్ణయ్యతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించడంతో ఆ పార్టీలో చేరి విద్యార్థి విభాగం నుండి సేవలందించారు. విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. గెల్లు శ్రీనివాస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటుండటంతో గుర్తించిన కేసీఆర్ ఆయన్ను హుజూరా బాద్ ఉపఎన్నిక అభ్యర్థిగా ప్రకటించారు.

అటు బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో కలియ తిరిగారు. ప్రజలు కాషాయపార్టీ వైపే మొగ్గు చూపుతారని  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ నేతలు సైతం ప్రజల్లోకి పూర్తి స్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.  

ఇక కడప జిల్లాలోని బద్వేల్ లో ఉపఎన్నిక హీట్ మొదలైంది. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో ఉపఎన్నిక ఖచ్చితం అయింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేశారు. ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ ను పోటీలో దింపారు.









మరింత సమాచారం తెలుసుకోండి: