చివరకు తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ఇంతలా దిగజారిపోయింది. గతంలో ఎన్టీయార్ ఓ కేసులో ఓడిపోతే తనకు కోర్టుల కన్నా  ప్రజాకోర్టే గొప్పదని ప్రకటించారు. ఇపుడు నారా లోకేష్ ప్రకటన కూడా దాదాపు అలాగే ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే శనివారం రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు అంటే ఐదు నిముషాల పాటు రాష్ట్రమంతా ఓ మోస్తరుగా మోత మోగింది. దేనికంటే చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగానట. ఈ పిలుపును లోకేష్ ఎందుకు ఇచ్చారో ఎవరికీ ఒక పట్టాన అర్ధంకావటంలేదు.





చంద్రబాబును అక్రమంగా అరెస్టుచేస్తే ప్రజాగ్రహం  ఎలాగుంటుందో చూపించాలట. ప్రజాగ్రహాన్ని ఎవరికి చూపించాలని లోకేష్ అనుకుంటున్నారు ? అరెస్టుచేసిన సీఐడీకా ? రిమాండు విధించిన ఏసీబీ కోర్టుకా ?  లేకపోతే క్వాష్ పిటీషన్ను  డిస్మిస్ చేసిన హైకోర్టుకా ? తప్పుడు కేసులు బనాయిస్తే వెనక్కు తగ్గమని నిరూపించాలట. సీఐడీ తప్పుడు కేసు పెట్టిందనే అనుకుందాం. మరి రిమాండ్ విధించి ఏసీబీ కోర్టు, క్వాష్ పిటీషన్ను డిస్మిస్ చేసి హైకోర్టు కూడా తప్పుచేసినట్లనా ?





లోకేష్ పిలుపు ఎలాగుందంటే కోర్టుల్లో విచారణ నుండి తప్పించుకోలేక జనాల మద్దతు కోరుతున్నట్లుగా ఉంది. కేసులో నుండి బయటపడాలంటే  కోర్టు విచారణ ద్వారా మాత్రమే సాధ్యం. అలాకాకుండా కోర్టు విచారణతో సంబంధంలేకుండా జనాలందరినీ మోతమోగించమని బతిమలాడుకున్నారంటే ఏమిటర్ధం ? జనాల మద్దతును చూపించి కోర్టు విచారణను కూడా ప్రభావితం చేద్దామని అనుకుంటున్నారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇన్నిరోజులు ఢిల్లీలో కూర్చున్నది బీజేపీ పెద్దల మద్దతుకోసమనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే లోకేష్ ఆశించినట్లుగా కమలనాదుల నుండి ఎలాంటి సహకారం కాదు కదా చివరకు అపాయిట్మెంట్ కూడా దొరకలేదు. సీఐడీ నోటీసులు అయితే ఇచ్చేసింది.





దాంతో ఇక లాభంలేదని లోకేష్ కు అర్ధమైనట్లుంది. అందుకనే మోతమోగించాలని జనాలను బతిమలాడుకుంటున్నాడు. అయితే జరిగిందేమిటంటే మామూలు జనాలు చాలా తక్కువగానే పార్టీ నేతలే ఎక్కువగా కనిపించారు.  మామూలు జనాలు రోడ్లపైన కనబడలేదు. ఎందుకంటే నంద్యాలలో అరెస్టుచేసి చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకొస్తేనే పార్టీ జనాలు కూడా రోడ్లపైకి రాలేదు. ఏసీబీ కోర్టు విచారణ జరుగుతుంటే పార్టీ జనాలను రమ్మని రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఫోన్లుచేసినా స్పందించలేదు. అలాంటిది ఇపుడు మోతమోగించమంటే జనాలు ఎందుకు స్పందిస్తారు ?


మరింత సమాచారం తెలుసుకోండి: