తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అచ్చంగా కేసీయార్ స్వయంకృమనే చెప్పాలి. మితిమీరిన అహంకారంతో కళ్ళుమూసుకుపోయి ప్రవర్తించారు. ప్రతిపక్షాలన్నా జనాలన్నా లెక్కలేకుండా వ్యవహరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క వార్తకూడా మీడియాలో కనబడకుండా తొక్కిపెట్టారు. మీడియా విషయంలో కేసీయార్ అనధికారికంగా అప్రకటిత ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రెస్ మీట్లలో ఎవరైనా రిపోర్టర్ ఒక్క ప్రశ్న కేసీయార్ కు ఇష్టంలేనిది అడిగితే వెంటనే ఎంత అవమానించాలో అంతా అవమానించారు.





ఇలాంటి చేష్టల వల్ల ప్రజల్లో తన ప్రభుత్వంపై ఏ స్ధాయిలో వ్యతిరేకత ఉందో చూడలేకపోయారు. ఇక ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను రాసిచ్చేశారు. దాంతో అవినీతి, అరాచకాలు ఆకాశమంత పెరిగిపోయాయి. ఎంఎల్ఏలంటే జనాల్లో ఎంతటి వ్యతిరేకత పెరిగిపోయినా కంట్రోల్ చేయలేదు. జనాలు వ్యతిరేకించిన ఎంఎల్ఏలకే టికెట్లు ఇవ్వటంతో వాళ్ళల్లో చాలామంది ఓడిపోయారు. పదేళ్ళుగా అధికారంలో ఉన్న పార్టీమీద జనాల్లో సహజంగానే వ్యతిరేకత ఉంటుందన్నది అందరికీ తెలిసిందే.





అలాంటి వ్యతిరేకతకు తోడు కేసీయార్ చేసిన తప్పులు, ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు కలిసి ఓటమికి దారితీశాయి.  మంత్రుల్లో కూడా చాలామంది విచ్చలవిడిగా వ్యవహరించారు. అయినా వాళ్ళని కూడా కంట్రోల్ చేయలేదు. వీటిన్నింటికీ అదనంగా నెలల తరబడి అసలు సెక్రటేరియట్   మొహమే చూడరు. సెక్రటేరియట్ మొహమే చూడని కేసీయార్ కు ముఖ్యమంత్రి పదవి ఎందుకు, అధికారం ఎందుకని నరేంద్రమోడీ సూటిగానే ప్రశ్నించారు. బహుశా జనాలు కూడా ఇలాగే ఆలోచించుంటారు.





ఇలాంటి అనేక విషయాలు ఆలోచించిన తర్వాత కేసీయార్ కు రెస్ట్ ఇవ్వాలని మెజారిటి జనాలు డిసైడ్ అయ్యారు. అందుకనే ఓడగొట్టారు. పైగా ఇపుడు కూడా కాంగ్రెస్ ఓడిపోతే తెలంగాణాలో అసలు ప్రతిపక్షమన్నదే లేకుండా పోతుంది. చెప్పుకోవటానికి బీజేపీ కూడా ప్రతిపక్షమే కానీ బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందం జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణను జనాలు నమ్మారు. జరుగుతున్న పరిణామాలు కూడా ఆ మాట నిజమే అన్నట్లుగా ఉంది. అందుకనే బీఆర్ఎస్ ను జనాలు ఓడగొట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: