కోర్టు షరతులను ఉల్లంఘించటమే కాకుండా ఏకంగా కోర్టు నిర్ణయాన్నే చంద్రబాబునాయుడు తప్పుపట్టారు. స్కిల్ స్కామ్ లో అరెస్టయి ప్రస్తుతం బెయిల్ మీద చంద్రబాబు బయటున్నారు. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వటాన్ని తప్పుపట్టిన ప్రభుత్వం సుప్రింకోర్టులో రివిజన్ పిటీషన్ వేసింది. అయితే బెయిల్ విషయంలో హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రింకోర్టు కేసుకు సంబంధించి ఎక్కడా మాట్లాడవద్దని స్పష్టంగా ఆదేశించింది. ఎక్కడా అంటే మీడియాతో కానీ బహిరంగసభల్లో కూడా మాట్లాడకూడదని షరతు విధించింది.





అయితే తుపాను బాధితులను పరామర్శించే పేరుతో గుంటూరు జిలాలో పర్యటించిన చంద్రబాబు రైతులతో మాట్లాడుతు స్కిల్ స్కామ్  లో తనను అన్యాయంగా జైలులో పెట్టినట్లు వాపోయారు. తాను ఏ తప్పు చేయకపోయినా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయటమే కాకుండా రిమాండుకు కూడా పంపినట్లు చెప్పారు. అంటే కేసుపెట్టి అరెస్టు చేసిన సీఐడీని తప్పుపట్టడమే కాకుండా రిమాండు విధించిన కోర్టును కూడా చంద్రబాబు తప్పుపట్టారు. మొదట్లో హైకోర్టు బెయిల్ ఇచ్చినపుడు విధించిన షరతులను కూడా చంద్రబాబు యధేచ్చగా ఉల్లంఘించిన విషయం అందరికీ తెలిసిందే.





ఇపుడు సుప్రింకోర్టు షరతులను కూడా లెక్కచేయలేదు. కేసు విషయమై చేసిన తాజా వ్యాఖ్యలతో చంద్రబాబుకు కోర్టులన్నా, చట్టాలన్నా ఎంతమాత్రం గౌరవం ఉందో అర్ధమవుతోంది. తాను యధేచ్చగా చట్టాలను, కోర్టు షరతులను ఉల్లంఘిస్తూనే ఎదురు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు. జగన్ వ్యవస్ధలను మ్యానేజ్ చేయటం ద్వారా తనకు బెయిల్ రాకుండా అడ్డుకున్నట్లు పదేపదే ఆరోపించటమే విచిత్రంగా ఉంది.





చంద్రబాబు బెయిల్ రద్దుపై ప్రభుత్వం దాఖలుచేసిన కేసు విచారణను సుప్రింకోర్టు జనవరి 19వ తేదీకి వాయిదావేసింది. ఇప్పటికే అనేక వాయిదాలు పడ్డాయి. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే తనమీద నమోదైన కేసులను కొట్టేయాలని చంద్రబాబు వేసిన 17ఏ క్వాష్ పిటీషన్ కూడా చాలాకాలంగా వాయిదాలు పడుతునే ఉంది. బహుశా 17ఏ పై తీర్పు చెప్పేంతవరకు చంద్రబాబు బెయిల్ పిటీషన్ వాయిదాలు పడుతునే ఉంటుందేమో. చంద్రబాబు షరతుల ఉల్లంఘనపై ప్రభుత్వం ఎలా రియాక్టవుతుందో చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: