లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మార్పు చెందుతున్నాయి. ఎన్నికలకు ఇంకా 40 రోజులు మిగిలి ఉన్నప్పటికీ అభ్యర్థుల వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. వాటిలో కరీంనగర్ పార్లమెంట్ స్థానం కూడా ఉంది. ఇక్కడ నుండి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ బరిలోకి దిగుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుండి వినోద్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ప్రచారం కూడా ప్రారంభించారు.

అయితే కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడం ఆశ్చర్యకరం. బండి సంజయ్ పై పోటీ అంటే గట్టి అభ్యర్థిని నిలబెట్టాలి. అదేవిధంగా పాపులారిటీ ఉన్న నాయకుడు అయితేనే బండి సంజయ్ పై గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నాలు జరపడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బలహీనమైన అభ్యర్థి కోసమే కాంగ్రెస్ వెతుకుతోందని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కొంతమంది ముఖ్య నేతల పేర్లు వినిపించినప్పటికీ వారిని పక్కన పెట్టి కొత్త ముఖాల కోసం వెతికే పనిలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. కొంతమంది ముఖ్యమైన నేతలు పోటీ చేసేందుకు రెడీగా ఉన్నప్పటికీ పార్టీ పెద్దలు మాత్రం ఒప్పుకోవడం లేదనే మాట వినిపిస్తుంది. గతంలో హుస్నాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇక్కడ లోక్ సభ రేసులో ఉన్నారు. కానీ పార్టీ మాత్రం ఆయనను నిలబెట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థిని వెతికే పనిలో ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కాంగ్రెస్ కు డమ్మీ దొరకడం లేదా..? అంటూ విమర్శలు చేస్తున్నాయి. ఎన్నికలకు 40 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పార్టీపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్ ని గెలిపించేందుకే పరోక్షంగా అతడికి సహకరిస్తుంది అనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే డమ్మీ క్యాండిడేట్ కోసం కాంగ్రెస్ అష్ట కష్టాలు పడుతోందని విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: