ఏపీలో ఎన్నికల నగారా మోగిన నాటి నుండి రాష్ట్రంలో విపక్షాలన్నీ తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాలు షురూ చేయడం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం వేదికగా జరిగిన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వై. ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రసంగం ఆహుతులను అలరించింది. మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన మాటలు ఖుషీ చేసాయి. విషయం ఏమిటంటే... ఈ సందర్భంగా జరిగిన సభ వేదికలో విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సదరు నాయకులను స్వయంగా పరిచయం చేస్తూ వారిని ఆకాశానికెత్తేయడం జరిగింది.

ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ... విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం, ఎచ్చెర్ల, గజపతినగరం అభ్యర్థులు అయినటువంటి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, తలే రాజేష్, గొర్లె కిరణ్‌కుమార్‌లను ప్రజలకు పరిచయం చేస్తూ... "వీరంతా మనకి ఆప్తులు, అత్యంత సౌమ్యులు. స్థానికంగా ఎంతో అభివృద్ధి చేసారు. అన్నింటికీ మించి ప్రజల మేలుకోరే పరిపాలనాదక్షులు. కాబట్టి మీ అమూల్యమైన ఓట్లు వీరిపైన కుమ్మరించి వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి. అలా చేస్తే అభివృద్ధి కొనసాగుతుంది, కుంటుపడకుండా ఉంటుంది. కూటమి కోతల్ని ఎవరూ నమ్మవద్దు!" అని ప్రజలను ఉద్దేశించి చేతులు జోడించి మరీ అభ్యర్థించారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మంత్రి బొత్స సత్యనారాయణను పరిచయం చేసినప్పుడు వైసీపీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు హర్షధ్వానాలు కురిపించారు. దాంతో సభ ప్రాంగణం పెద్ద ఎత్తున దద్దరిల్లింది. ఆ సమయంలోనే మంత్రి బొత్సను ప్రత్యేకంగా తనకు తండ్రి సమానులని జగన్ పేర్కొనడం అందరినీ ఆశ్చర్యవేసింది. అక్కడితో ఆగకుండా ప్రజలంతా ఆయనను ఆశీర్వదించాలని జగన్ స్వయంగా కోరగా జనం కేరింతలు కొట్టడం జరిగింది. దాంతో మంత్రి బొత్స ఒకింత భావోద్వేగానికి గురై కన్నీరు మున్నీరయ్యారు. ఈ దృశ్యం చూసిన ప్రజలు, అభిమానులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: