అధికారం ద‌క్కించుకోవ‌డం.. అంటే మాట‌లు కాదు. ఇది మీ నాన్నాగారు ఇచ్చిందో.. మా నాన్న‌గారు ఇచ్చిందో కాదు చంద్ర‌బాబు.. ఇది అశేష ప్రజానీకం ఇచ్చిన ప‌ద‌వి. అవ‌కాశం - నిండు స‌భ‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  చెప్పిన మాట‌. ఇది వాస్త‌వం. ఎరికైనా ప్ర‌జ‌లే అధికారం ఇవ్వాలి. అయితే.. ఇలా ఒక్క‌సారి అధికారం ద‌క్కించుకున్నాక‌.. దానిని నిల‌బెట్టుకునేది మాత్రం నాయ‌కులే. ఎమ్మెల్యేల నుంచి ముఖ్య‌మంత్రుల వ‌ర‌కు కూడా.. అంద‌రికీ ఒకే సూత్రం  వ‌ర్తిస్తుంది.


ఈ విష‌యంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌క్సెస్ అయ్యారు. 2004లో పాద‌యాత్ర ద్వారా అధికారంలోకి వ‌చ్చిన వైఎస్‌.,. 2009కి వ‌చ్చే స‌రికి మాత్రం త‌న పాల‌న‌తోనే ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యారు. సీట్లు త‌గ్గినా.. అధికారాన్ని మాత్రం ప‌దిలం చేసుకున్నారు. దీనికి కార‌ణం.. నాయ‌కుల‌కు అందుబాటులో ఉండ‌డంతోపాటు.. రాష్ట్రానికి మేలు చేయాల‌న్న సంక‌ల్పం ఉంద‌నే సంకేతాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లారు. ప‌లితంగా 2009లో ఎన్ని పార్టీలు కూట‌మి క‌ట్టినా.. వైఎస్ త‌న అధికారాన్ని శాస్వ‌తం చేసుకున్నారు.


ఇక‌,వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుమారుడిగా.. రాజ‌కీయ అరంగేట్రం చేసిన జ‌గ‌న్ కూడా.. ఇలానే తొలిసారి పాద‌యాత్రతో అధికారంలోకి వ‌చ్చారు. ఎవ‌రూ ఊహించ‌ని.. విధంగా అధికారం ద‌క్కించుకున్నారు. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో సీట్లు ద‌క్కించుకున్నారు. ఇది మొత్తంగా రెండు కార‌ణాల‌తో ఆయ‌న‌కు ప్ర‌జ‌లు అధికారం అప్ప‌గించారు. 1) వైఎస్ వార‌సుడు అనేది. 2) యువ నాయ‌కుడు, కార్పొరేట్ వ్య‌వ‌హారాలు న‌డిపిన చ‌రిత్ర ఉండ‌డం. ఈ రెండు కార‌ణాల‌తో రాష్ట్రానికి మేలు చేస్తార‌ని అనుకున్నారు.


కానీ, వైఎస్ పాల‌న‌లో అంద‌రినీ క‌లుపుకొని పోతే.. జ‌గ‌న్ పాల‌న‌లో మాత్రం.. అంద‌రికీ ఆయ‌న దూర‌మ య్యారు. ఒక ప్యాలెస్ నిర్మించుకుని అక్క‌డే ఉండిపోయారు. వైఎస్ హ‌యాంలో క‌క్ష పూరిత రాజ‌కీయాల‌కు  ఆయ‌న చోటు పెట్ట‌లేదు. కానీ, జ‌గ‌న్ వాటినే ప్రాతిప‌దిక‌గా చేసుకుని ముందుకు సాగారు. ఇక‌, వైఎస్ హ‌యాంలో అంద‌రికీ అన్నీ అనే సూత్రాన్ని అవ‌లంభించారు. ఇదేస‌మ‌యంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని కూడా గ‌మ‌నంలో పెట్టుకుని ఐఐటీలు స్థాపించారు. కానీ, జ‌గ‌న్ ఈ విష‌యంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ఫ‌లితంగా.. రెండో సారి అధికారం ద‌క్కించుకోలేక పోయారు. ఇక‌మీద‌ట కూడా ద‌క్కించుకునే అవ‌కాశం చాలా వ‌ర‌కు స‌న్న‌గిల్లింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: