పొరుగు దేశం పాకిస్తాన్ లీడర్లు తమ అడ్డగోలు మాటలు, వింత ప్రవర్తనతో నిత్యం వార్తల్లో ఉంటుంటారు. ఇప్పుడు మరో పాక్ ఎంపీ షేర్ అఫ్జల్ ఖాన్ మార్వత్ తన దిమ్మతిరిగే వ్యాఖ్యలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన కామెంట్స్, భారత్‌తో యుద్ధం వస్తే ఏం చేస్తానన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానం విని అంతా అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పాకిస్తానీ పార్లమెంటు సభ్యుడు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక విలేఖరి ఆయన్ను సూటిగా ప్రశ్నించారు.. "ఒకవేళ భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తే మీరు ఏం చేస్తారు సార్?" అని. ఈ ప్రశ్నకు మార్వత్ క్షణం కూడా ఆలోచించకుండా, ఏ మాత్రం బెరుకు లేకుండా ఇచ్చిన సమాధానం మతిపోగొట్టేలా ఉంది.

"యుద్ధమా.. వస్తే నేనేం చేస్తానో తెలుసా? వెంటనే లండన్‌కు టికెట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్లిపోతాను." అంటూ బాధ్యతారాహిత్యంగా చెప్పేశాడు. దీన్ని విన్న నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే ఓ ఎంపీకే యుద్ధం వస్తే పలాయన చిత్తం ఉంటే, ఇక సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుల మనోధైర్యం ఎలా ఉంటుందని మండిపడుతున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ గురించి ఆయన్ను ప్రశ్నించినప్పుడు ఇచ్చిన సమాధానం మరింత విస్మయానికి గురి చేసింది. "భారత ప్రధాని మోడీ సంయమనం పాటించాలని మీరు కోరుతారా" అని విలేఖరి అడిగితే.. అందుకు షేర్ అఫ్జల్ ఖాన్ మార్వత్ స్పందిస్తూ.. "మోడీ నా అత్త కొడుకా ఏంటి? నేను చెబితే ఆయన ఎందుకు వింటాడు?" అంటూ చాలా చులకనగా, అగౌరవంగా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీపై పాక్ ఎంపీ నేరుగా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంపై భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతోంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ షేర్ అఫ్జల్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాయకుడే. ఇమ్రాన్ ఖాన్‌కు చాలా సన్నిహితుడిగా కూడా మెలిగారు. కానీ కాలక్రమేణా సొంత పార్టీ, ఇమ్రాన్ ఖాన్‌పైనే నిప్పులు చెరుగుతూ, తీవ్ర విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాడు. ఈ వైఖరి నచ్చని ఇమ్రాన్ ఖాన్.. మార్వత్‌ను పార్టీ పదవుల నుంచి దూరం పెట్టారు.

ఇది పాకిస్తాన్ రాజకీయాల్లో అంతర్గత కుమ్ములాటలు, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, తీవ్ర గందరగోళ పరిస్థితులకు అద్దం పడుతోంది. బాధ్యతాయుత స్థానంలో ఉండి కూడా దేశ భవిష్యత్తు, రక్షణ గురించి ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని చాలా మంది తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఇలా పాక్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే.. మరోవైపు భారత్ మాత్రం తమపై జరిగిన దాడికి గట్టి బదులిస్తూ, శత్రువులకు తమ బలాన్ని చూపుతోంది. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడి వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని భారత నిఘా సంస్థలు స్పష్టంగా నిర్ధారించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై మూడు కీలక రంగాల్లో ఉక్కుపాదం మోపుతూ, వారికి ఊహించని షాకిచ్చింది.

ముందుగా, 1960 నాటి చారిత్రాత్మక సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది వ్యవసాయాధారిత దేశమైన పాకిస్తాన్‌కు నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపనుంది. రెండవది, పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చే అన్ని రకాల దిగుమతులు, మెయిల్స్, పార్శిళ్లు, షిప్పింగ్‌ను భారత్ పూర్తిగా నిలిపివేసింది. ఇకపై ఏ పాకిస్తానీ నౌక కూడా భారతీయ రేవుల్లోకి రాకూడదని స్పష్టం చేసింది. మూడవది, అన్ని స్వల్పకాలిక పాకిస్తాన్ వీసాలను భారత్ రద్దు చేసి, ప్రస్తుతం దేశంలో ఉన్న అలాంటి వారందరినీ వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: