
- ఎన్టీఆర్ కృష్ణుడి విగ్రహంతో హిందువులు, యాదవుల మనోభావాలు దెబ్బతిన్నాయ్
- సనాతన ధర్మం పేరుతో అధికారంలోకి వచ్చిన పవన్ స్పందిచరా..?
- విగ్రహం తొలగించకపోతే నేడు ఛలో తక్కెళ్లపాడు
- బీసీవై అధినేత రామచంద్ర యాదవ్
విశాఖపట్నం: విశాఖస్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు మౌనంగా ఉండడం వెనక కోట్లాది రూపాయల విలువైన స్టీల్ ప్లాంట్ ఆస్తులు, భూములు కాజేసే కుట్ర ఉందని బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన విశాఖపట్నం పర్యటనలో మీడియాతో మాట్లాడారు. బీసీవై పార్టీ నిర్మాణానికి సంబంధించి నాయకులు, కార్యకర్తల సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు బీజం వేసిందని.. నాడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తిన చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు మౌనంగా ఉండడం వెనక ఆంతర్యం ఏంటని ? ప్రశ్నించారు. నేడు తెలుగుదేశం మద్దతుతోనే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోందని.. చంద్రబాబుకు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశక్తి ఉన్నా కోట్లాది రూపాయల స్టీల్‌ప్లాంట్ ఆస్తులు కాజేయాలని.. వేలాది కుటుంబాలను రోడ్డుమీదకు తీసుకురావాలన్న లక్ష్యంతోనే ఆయన మౌనం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌లోని 40 విభాగాలను ప్రైవేటీకరణ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసినా బాబు, పవన్‌కు ఏమాత్రం పట్టినట్టుగా లేదన్నారు. ఈ దోపిడి పర్వంలో చంద్రబాబు, పవన్ ఇన్‌డైరెక్టుగా కేంద్రప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఇస్తున్నారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు.
తక్షణమే చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే బీసీవై పార్టీ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులతో కలిసి ఎలాంటి ఉద్యమం చేయడానికి అయినా సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం తప్పుడు హామీలు, మోసపు మాటలతోనే అధికారం అనుభవించారు... మరోసారి స్లీట్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నారని విమర్శించారు. అలాగే కొద్ది నెలల క్రితం తెలంగాణలోని ఖమ్మంలో శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినప్పుడు హిందూ, యాదవ సంఘాల ఉద్యమంతో తెలంగాణ హైకోర్టు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ఆదేశాలు జారీ చేసిందని.. కాని నేడు ఏపీలోని గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో మరోసారి కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారని.. ఇది యాదవులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిందన్నారు. టీడీపీ నాయకులు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు చేస్తోన్న ఈ ప్రయత్నం అడ్డుకునేందుకు తాను శనివారం తక్కెళ్లపాడులో పర్యటించి నిర్వాహకులతో మాట్లాడానన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు సైతం విగ్రహావిష్కరణ చేయడం లేదని తప్పుదోవ పట్టించి ఆదివారం ఉదయం విగ్రహావిష్కరణ చేసే దుస్సాహాసానికి ప్రయత్నించారని మండిపడ్డారు.
ఈ తరహా సంఘటనలతో మతాల మధ్య చిచ్చుపెట్టే విష సంస్కృతికి బీజం వేసినట్టు అవుతుందని.. ఇది పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లో... అండదండలతో జరిగిందన్నారు. చంద్రబాబు పూర్తి బాధ్యత తీసుకుని ఈ విగ్రహాన్ని తొలగించని పక్షంలో ఆదివారం ఉదయం ఛలో తక్కెళ్లపాడు కార్యక్రమానికి పిలుపు ఇచ్చి శ్రీకృష్ణుడికి అవమానం జరిగిన చోటే ఆ విగ్రహాన్ని చెరువులో నిమజ్జనం చేస్తామన్నారు. ఈ విషయంలో ప్రతి హిందువు స్పందించాలని.. లేనిపక్షంలో ఈ విష సంస్కృతి విస్తరించి హిందూ సంస్కృతికి భవిష్యత్తులోనూ తీవ్ర అవమానాలు తప్పవన్నారు. సనాతన ధర్మం పేరుతో అధికారంలోకి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఈ అంశంపై స్పందించాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మహిళలను, ఉద్యోగులను, యువకులను, డీఎస్సీ అభ్యర్థులను, గ్రూప్-1 అభ్యర్థులను మోసం చేశారని.. ఇప్పుడు హిందువులను కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించను అని రామచంద్ర యాదవ్ హెచ్చరికలు జారీ చేశారు.