రాజకీయాల్లో ఒకప్పుడు పెద్ద సంచలనాలు సృష్టించిన వైసీపీ ఫైర్ బ్రాండ్ల పరిస్థితి ఇప్పుడు బీభత్సంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వీరు మాట్లాడితే హెడ్లైన్స్ మారేవి. నోరు విప్పితే ఆగ్రహం, దూషణలు, బూతులతో విరుచుకుపడేవారు. ప్రత్యర్థి పార్టీల నేతలు, ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే రెండో, మూడో శ్రేణి నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు అందరికీ గుర్తే. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే), కొడాలి నాని (గుడివాడ మాజీ ఎమ్మెల్యే), అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు మాజీ ఎమ్మెల్యే) – ఒకప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్లుగా పిలువబడ్డ ఈ ముగ్గురూ ఎన్నికల్లో ఓడిపోయాక పూర్తిగా సైలెంట్ అయ్యారు.
 

అనిల్ కొన్నిసార్లు మీడియా ముందు మాట్లాడినప్పటికీ ఆయనపై గనుల కేసు నమోదవడంతో మళ్లీ వెనక్కి తగ్గారు. ద్వారంపూడి మీద పెద్ద కేసులు లేనప్పటికీ, బియ్యం అక్రమ రవాణా వ్యవహారాలు ఎప్పుడూ వెంటాడుతున్నాయి. కొడాలి నాని పరిస్థితి అయితే మరీ విచిత్రం – ఆయనపై కేసుల పరంపర ఒకటే అయినా, ఎప్పటిలాగే బైటికి రాకుండా పూర్తిగా నీరసంగా ఉన్నారు. ఈ ముగ్గురు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దూషణలు, బూతులు, వ్యక్తిగత విమర్శలు చివరికి వారి ఇమేజ్‌ను దెబ్బతీశాయి. పార్టీకి మేలు చేయకపోవడమే కాకుండా ప్రజల్లో కూడా విపరీతంగా నెగెటివ్‌గా మారారు. ఫలితంగా ఓటమి తప్పలేదు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోవడంతో, మరీ కేసులు మెడమీద వేలాడుతుండడంతో మరో మూడు సంవత్సరాలు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపించడం లేదు.



వైసీపీ ఓటమి తర్వాత ఏడాదిన్నర గడిచినా ఈ ఫైర్ బ్రాండ్లు ఒక్కరు కూడా బైటకు వచ్చి గళం వినిపించలేదు. పార్టీ తరఫున ఎక్కడా అగ్రెసివ్‌గా వ్యవహరించలేదు. ఇదే సమయంలో పార్టీ అధినేత కూడా వీరిని బలవంతంగా బయటకు రమ్మని చెప్పకపోవడం గమనార్హం. పార్టీకి అవసరం లేకపోవడం కాదు కానీ, వీరు బయటకు వస్తే మరింత వివాదాలు రేకెత్తిస్తారనే భయం కూడా ఉందని అంటున్నారు.ఎన్నికల సమయంలో హవా క్రియేట్ చేసిన ఈ ఫైర్ బ్రాండ్లు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఇంకో మూడేళ్లపాటు ఇలాగే ఉంటారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయాల్లో దుమ్మురేపిన వారే, ఇప్పుడు కేసుల భారంతో, ఓటమి షాక్‌తో మూల కునికిపోయిన స్థితిలో ఉండడం వైసీపీ లోపలి వర్గాలకే కాక, ప్రజల్లో కూడా ఆశ్చర్యంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: