భారత రాజకీయాల్లో అరుదుగా జరిగే పరిణామం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్ తాజాగా తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు, కేంద్రంలోని మోడీ సర్కారుకు పరోక్షంగా భారీ షాక్ ఇచ్చినట్టుగా జాతీయ మీడియాలో చర్చ మొదలైంది. ఇటీవలి వర్షాకాల సమావేశాలు మొదలై రెండో రోజే ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా ధన్‌ఖడ్ రాత్రికి రాత్రే తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. ఆ వెంటనే అది ఆమోదం పొందింది. ఆరోగ్యం సహకరించడం లేదని కారణం చెబుతూ ఎక్స్‌లో ఆయన చేసిన పోస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన గురించి పెద్దగా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. మీడియా హంగామా లేకుండానే ఆయన పూర్తిగా నిశ్శబ్దం పాటించారు.

కానీ తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం చర్చకు కొత్త ఎత్తు తెచ్చింది. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవనాని వెల్లడించిన దాని ప్రకారం – ధన్‌ఖడ్ మాజీ ఎమ్మెల్యే హోదాలో పింఛను కోసం దరఖాస్తు చేశారు. 1993లో కిషన్‌గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అప్పట్లో పింఛను పొందేవారు కూడా. ఇప్పుడు మళ్లీ 42 వేల రూపాయల పింఛనుకు దరఖాస్తు చేశారు. ఇది సంచలనం ఎందుకంటే – ఉపరాష్ట్రపతి పదవి నుంచి రాజీనామా చేసిన ఆయనకు స్వయంగా నెలకు 2 లక్షల రూపాయల పింఛను రావాల్సిందే. ఆయన పదవిలో ఉన్నప్పుడు 4 లక్షల జీతం అందుకున్నారు, దాని సగం పింఛనుగా లభించాలి. అంటే ఆయనకు అందాల్సిన మొత్తం ఇది. కానీ దానిని పక్కన పెట్టి కేవలం మాజీ ఎమ్మెల్యేగా 42 వేల రూపాయలు తీసుకోవాలని అడగడం రాజకీయంగా అనేక సందేహాలు రేకెత్తిస్తోంది.

దీనిని ఆయన మనసులోని ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేసే మరో మార్గమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలు బయటపెట్టకుండా, ఈ విధంగా పరోక్షంగా సందేశం ఇస్తున్నారా? అన్న చర్చ మొదలైంది. మొత్తానికి, రాజీనామా తర్వాత పబ్లిక్ లైఫ్‌లోకి తిరిగి రాని ధన్‌ఖడ్ ఇప్పుడు చేసిన ఈ సంచలన అడుగు మళ్లీ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రం మీద ఆయన అసంతృప్తి నిజంగానే ఉందా? లేక ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయమేనా? అనే దానిపై రానున్న రోజులు స్పష్టత ఇస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: