తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అసెంబ్లీలో కాళేశ్వర ప్రాజెక్ట్ పై సీబీఐ విచారణకు సిఫారసు చేస్తూ సంచలనాత్మక ప్రకటన చేశారు. వెంటనే సీబీఐకి లేఖ రాసి, ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ సర్కార్ తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా దాన్ని పునరుద్ధరించలేదు. మరి రేవంత్ సీబీఐ విచారణ ఎలా జరపగలరు? అనే ప్రశ్న ఒక్కసారిగా లేవింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం.. సీబీఐకి కన్సెంట్ పునరుద్ధరించే ఉత్తర్వులు జారీ చేసి క్లారిటీ ఇచ్చింది.


ఇక ఇక్కడ ప్రధాన చర్చ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ గురించే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్ గాంధీ.. ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఎప్పుడూ తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. “అన్ని బీజేపీ జేబు సంస్థలే” అని కాంగ్రెస్ ఎన్నిసార్లు చెప్పింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ఈ సంస్థలు ఇబ్బంది పెట్టిన తీరు అందరికీ తెలుసు. అలాంటిది తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఆ సంస్థలపైనే నమ్మకం ఉంచి, కాళేశ్వరంపై విచారణ కోరడం ఆశ్చర్యంగా మారింది.



ఇదిలా ఉండగా రేవంత్ నిర్ణయం వెనుక రాజకీయ లెక్కలు వేరే ఉన్నాయనేది విశ్లేషకుల టాక్. బీఆర్‌ఎస్‌పై నేరుగా చర్యలు తీసుకుంటే.. "కక్ష సాధింపు" అని సానుభూతి రాగలదు. అందుకే బంతిని బీజేపీ వైపు నెట్టేసినట్టే. సీబీఐ విచారణ కోరడం ద్వారా తాను నిష్పక్షపాతిగా ఉన్నానని చూపించుకోవడం ఆయన ప్లాన్ అయ్యుంటుంది. కానీ ఇక్కడ మరో సమస్య.. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చెప్పే మాటలు, తెలంగాణ కాంగ్రెస్ చేసే పనులు భిన్నంగా ఉండడం. దీన్ని బీజేపీ ఎత్తి చూపుతూ “రాహుల్ చెప్పేది వేరే.. రేవంత్ చేసేది వేరే” అని ఎదురు దాడి చేసే అవకాశం ఉంది.



కాంగ్రెస్ హైకమాండ్‌తో రేవంత్ ఈ నిర్ణయం ముందే చర్చించారా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ ఒకవేళ చర్చించకుండా తీసుకున్న నిర్ణయమైతే.. హైకమాండ్-రేవంత్ మధ్య గ్యాప్ మరింత పెరగొచ్చని కొందరు భావిస్తున్నారు. ఇక రేవంత్ అనుచరులు మాత్రం.. “సీఎం చేసినది ధైర్యమైన పని.. కాళేశ్వర అవినీతిని బయట పెట్టేది ఈ నిర్ణయమే” అని గట్టిగా సమర్థిస్తున్నారు. మొత్తానికి రేవంత్ సీబీఐ విచారణ అడుగుతో తెలంగాణలో మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో కూడా పెద్ద రాజకీయ చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: