జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల ఒక ప్రెస్‌మీట్‌లో “పార్టీ నడపడానికి ఇబ్బందులు పడుతున్నాం… ఎవరికైనా డబ్బులు ఉంటే సాయం చేయండి” అన్నారు. ఆ మాటలు సరదాగా అన్నట్టే అనిపించాయి కానీ — ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఆ మాటలను సీరియస్‌గా తీసుకుందేమో! ఎందుకంటే తాజాగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన రిపోర్ట్ ప్రకారం, ఆ ట్రస్ట్ వైఎస్ఆర్‌సీపీకి రూ.98 కోట్లు విరాళంగా ఇచ్చింది. మొత్తం మీద 2024-25 ఆర్థిక సంవత్సరంలో వైసీపీకి రూ.140 కోట్లు విరాళాలుగా వచ్చాయి! అధికారంలో లేనప్పటికీ విరాళాల వర్షం! .. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి కార్పొరేట్ల నుంచి విరాళాలు రావడం కామన్. కానీ వైసీపీ సంగతి మాత్రం వేరేలా ఉంది. అధికారాన్ని కోల్పోయి, ఘోర పరాజయం పాలైన తర్వాత కూడా ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు రావడం ఆశ్చర్యకరం. 2023-24లో ఎన్నికల సంవత్సరం కావడంతో రూ.184 కోట్ల విరాళాలు రావడం సహజమే అనిపించింది. కానీ ఇప్పుడు అధికారంలో లేని పార్టీకి ఇంత భారీ మొత్తంలో డొనేషన్లు రావడం - ఎవరికి అర్థం కాని మాయ.


ఇదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు 97% తగ్గి పది కోట్లకు చేరాయి. కానీ వైసీపీ మాత్రం విరాళాల్లో రికార్డు సృష్టించింది. ఎవరది ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్? ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ అనేది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఒక కార్పొరేట్ కలెక్షన్ ప్లాట్‌ఫారమ్. కంపెనీలు నేరుగా తమ పేరుతో పార్టీకి డబ్బు ఇవ్వకుండా, ఈ ట్రస్ట్‌ ద్వారా పంపుతాయి. దీంతో ఎవరినుంచి డబ్బు వచ్చిందో బయటపడదు. ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత, ఈ ట్రస్టుల పాత్ర మరింత పెరిగింది. అయితే ఇప్పుడు జగన్ బినామీల కంపెనీలు ఈ ట్రస్ట్‌కు డబ్బులు పంపి, అక్కడ్నుంచి తిరిగి వైసీపీకి విరాళాలుగా మళ్లించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఇచ్చిన కంపెనీలు ఎవంటే... ప్రూడెంట్ ట్రస్ట్‌ తో పాటు నాట్కో ప్రైవేట్ లిమిటెడ్‌, ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్‌, వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌ వంటి సంస్థలు కూడా రూ.10 కోట్లు చొప్పున విరాళాలు ఇచ్చాయి.



వీటిలో వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్‌ కంపెనీ వార్షిక ఆదాయం పది కోట్లు కూడా కాకపోవడంతో, ఇంత భారీ విరాళం ఎలా ఇచ్చిందన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. డెఫిసిట్‌ను కవర్ చేయడానికా ఈ విరాళాలు? 2023-24లో వైసీపీ మొత్తం రూ.184 కోట్ల ఆదాయం చూపించింది. కానీ ఖర్చు మాత్రం రూ.295 కోట్లు! అంటే దాదాపు రూ.104 కోట్ల లోటు. అందుకే ఈ సారి రూ.140 కోట్ల విరాళాల లెక్క చూపించి, ఆ లోటును కవర్ చేసే ప్రయత్నం చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ వర్గాల్లో చర్చ ...  ఒకవైపు జగన్ “పార్టీ నడవడం కష్టం” అంటుంటే, మరోవైపు కార్పొరేట్ ట్రస్టులు కోట్ల రూపాయలు విరాళాలుగా ఇవ్వడం అనేది ప్రజల్లో అనేక ప్రశ్నలు రేపుతోంది. ఇది నిజంగా కార్పొరేట్ సాయం మాత్రమేనా? లేక వైసీపీ సొంత లావాదేవీలకా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రానున్న రోజుల్లో రాజకీయంగా హీట్ పెంచే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: