జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు రాగానే రాజకీయ వేడి మామూలుగా లేదు. ఈ సారి ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ - మూడు కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ రాజకీయ నేతల ఈ ప్రతిష్ట ప్రజలకు శిక్షగా మారింది. శుక్రవారం నుంచి పార్టీ నేతలు రోడ్ షోలు, మైక్ ర్యాలీలతో జూబ్లిహిల్స్ వీధులను బ్లాక్‌ చేశారు. సాయంత్రం పూట ఇంటికో, ఆఫీసుకో వెళ్తున్న సాధారణ ప్రజలకు రెండు గంటల ట్రాఫిక్ జామ్‌లు తప్పవు. సీఎం రేవంత్‌ రెడ్డి ఒక వైపు, కేటీఆర్ మరో వైపు - ఇద్దరూ ఒకే రోజున ప్రచారం చేయడంతో జూబ్లిహిల్స్ ప్రజలకు ట్రాఫిక్ నరకం అనుభవమైంది.


రాజకీయ నాయకుల ఈ ప్రచార తీరు ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది. రోడ్ షో పేరు చెప్పి రోడ్లు మూసేయడం, సైరన్లు మోగిస్తూ వాహనాలను ఆపేయడం - ప్రజల ఇబ్బందులు పట్టించుకోని ఆడంబర రాజకీయాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. తమ ప్రసంగాలకు పెద్ద జనసంద్రం వచ్చినట్లు చూపించుకోవడమే వీరి లక్ష్యం. కానీ ప్రజలు మాత్రం ఆ ప్రసంగాలను వినడం దూరం - అసహనంతో రోడ్డుపై తిట్టుకుంటూ వెళ్లిపోతున్నారు. నిజానికి, రోడ్ షోల వల్ల ఎవరూ ఓటు వేయరు. ఇది రాజకీయ సత్యం. ఓటు వేయాలా వద్దా అనేది ప్రజలు ముందే నిర్ణయించుకుంటారు. కానీ పార్టీలు మాత్రం “మనం వెనుకబడినట్టుగా అనిపించకూడదు” అనే భావనతో జన సమీకరణ యుద్ధం మొదలుపెట్టాయి. వందల బైకులు, వందల బ్యానర్లు, డ్రమ్ బీట్లు - ఇవన్నీ చూపించడానికి మాత్రమే. ప్రచార ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపవు.



జూబ్లిహిల్స్ వంటి సిటీ మద్యంలోని చిన్న నియోజకవర్గంలో ఈ రకమైన రోడ్ షోలు చేస్తే, అది ప్రజలకే ఇబ్బంది. అరగంటలోనే మొత్తం నియోజకవర్గం తిరగవచ్చు. అలాంటి చోట పెద్ద బహిరంగ ర్యాలీలు చేయడం అవసరం లేదు. కానీ నేతలకీ మీడియా దృష్టీ, కెమెరా ఫోకస్‌ ముఖ్యమైపోవడంతో ప్రజా ఇబ్బందులు గాలికి వదిలేశారు. ప్రజల ఇబ్బందులే చివరికి పార్టీల మైనస్‌గా మారతాయి. ఇంటింటికి వెళ్లి మాట్లాడడం, నేరుగా ఓటర్లను కలవడం ఈ సిటీ ఎన్నికల్లో ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. కానీ రోడ్ షోలతో పార్టీ యంత్రాంగం అంతా బిజీ అయిపోతుంది. ఫలితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తిగా ఆగిపోతుంది. ప్రజల మనసులు గెలుచుకోవాలంటే రోడ్లను కాదు, హృదయాలను తడవాలి. రోడ్ షో బదులు ఓపెన్ గ్రౌండ్లలో సభలు నిర్వహించి ప్రజలను ఆహ్వానిస్తే – అదే నిజమైన ప్రజాస్వామ్య ప్రచారం అవుతుంది. లేకపోతే రోడ్డుపైనే ఓటర్లు తిట్టుకుంటూ వెళ్ళిపోతారు, ఓటు మాత్రం వేరే వాళ్లకు వేస్తారు!

మరింత సమాచారం తెలుసుకోండి: