- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . . .

ఏకాదశి పర్వదినాన మరో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదం నింపింది. ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని కాశిబుగ్గలో కొత్తగా నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్లారు. ఆలయం మొదటి అంతస్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు మెట్ల మార్గం ద్వారా వెళుతుండగా.. ఒక్కసారిగా రెయిలింగ్ కూలిపోయింది. దీంతో 9 మంది అక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆస్పత్రికి తరలించిన తర్వాత మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది.


ఘటన విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి అచ్చం నాయుడు, ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, సహా పలువురు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి, ఘటనకు సంబంధించి పూర్తి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతోనే ఘటన జరిగినట్లు వెల్లడించారు. దేవుడు దర్శనానికి వచ్చే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ఆయన, బాధితులకు తక్షణ సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గజపతినగరంలో పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి విషయం తెలుసుకున్న వెంటనే ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని కాశిబుగ్గ చేరుకున్నారు.


అటు అచ్చం నాయుడు కూడా వెంటనే ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. కాగా నాలుగేళ్ల క్రితం నిర్మాణం చేపట్టిన ఈ ఆలయం మే నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆలయానికి ధర్మకర్తగా ఉన్న హరి ముకుంద పండా.. నాలుగేళ్ల క్రితం తిరుమల శ్రీవారి ఆలయానికి వెళ్ళగా అధికారులు దర్శనానికి అనుమతించకపోవడంతో, 20 కోట్ల రూపాయల వ్యయంతో 12 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపట్టారు. ఇక ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదని తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. నిర్వాహకులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతోనే ఏర్పాటు చేయలేదని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: